హైదరాబాద్ : రాష్ట్రంలోని అభయారణ్యాలలో పర్యాటకాభివృద్ధికి అటవీ శాఖ ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ (కెటిఆర్) పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభించి ఆన్‌లైన్‌లో వివరాలను ప్రకృతి ప్రేమికులకు అందుబాటులో ఉంచి రాష్ట్ర అటవీ శాఖ తాజాగా ఆమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్(ఎటిఆర్) పేరుతో ఓ వెబ్ సైట్‌తో పాటు మరిన్ని కార్యక్రమాలను నిర్వహించనున్నది. శుక్రవారం (నేడు) ఆమ్రాబాద్ పులుల అభయారణ్య ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించనున్నారు.
మన్ననూరులో అటవీశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే సఫారీ టూర్ ద్వారా పర్యాటకులకు ముచ్చటైన రీతిలో రూపుదిద్దుకున్న ఓ పర్యాటక కాటేజీ, నల్లమలలో వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా ప్యాకేజీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇందులోని వసతులను మరింత పెంచారు. పలు హంగులు సమకూర్చారు. పర్యాటకులకు ఎనిమిది కొత్త సఫారీ వాహనాలు, బస చేసేందుకు ఆరు కాటేజీలు, ఆమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్(ఎటిఆర్) పేరుతో ఓ వెబ్‌సైట్, ఎన్నెన్నో విశేషాలను ప్రత్యక్షంగా చూపించే ప్రత్యేక డిజిటల్ తెర వంటి హంగులు సమకూర్చారు.
వీటితో పాటు వన్యప్రాణులు, విశేషాలతో కూడిన పుస్తకాలను మంత్రి ఆవిష్కరించనున్నారు.