ప్రధానికి పోస్ట్ కార్డు రాసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పోస్ట్ కార్డు రాశారు. రాష్ట్రంలో చేనేత సమస్యలపై మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేతపై విధిస్తున్న జీఎస్టీకి నిరసన వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బుధవారం ఉత్తరం రాసి నిరసన తెలియజేశారు. చేనేత వస్త్రాలు, ఉత్పత్తులపై ఉన్న 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ భారాన్ని కేంద్రప్రభుత్వం మోపడం సరికాదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, బీజీపీ కేంద్ర ప్రభుత్వానికి నేతన్నల ఉసురు తగులుతుందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా విధంగా చేనేతపై 5% జీఎస్టీ విధింపుతో ఎన్నో దశబ్దాలుగా చేనేతనే నమ్ముకుని స్వయం ఉపాధిపై ఆధారపడ్డ నేతన్నల పరిస్థితి మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్లు తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ ప్రధానికి లక్షలాదిగా పోస్ట్ కార్డులు రాసి తమ నిరసన వ్యక్తం చేస్తూ… నేతన్నలకు అండగా నిలబడాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.