Monday, December 23, 2024

ఐసియులో రోగిని ఎలుకలు కరిచిన ఘటనపై మంత్రి సీరియస్

- Advertisement -
- Advertisement -

విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించిన మంత్రి
ప్రాథమిక నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసిన డిఎంఇ

మనతెలంగాణ/హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలోని ‘ఐసియులో రోగిని కరిచిన ఎలుక’ అని వివిధ పత్రికల్లో వచ్చిన పత్రిక కథనాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన మంత్రి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా తక్షణం చర్యలు చేపట్టాలని మంత్రి వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషన్ డాక్టర్ అజయ్‌ కుమార్,కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్‌లు విచారణ నిర్వహించి ప్రాథమిక నివేదిక సమర్పించారు. అధికారుల నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్సును సస్పెండ్ చేస్తూ డిఎంఇ డాక్టర్ త్రివేణి ఉత్తర్వులు జారీ చేశారు.

సస్పెన్షన్ ఎత్తివేయకపోతే ఛలో డిఎంఇ ప్రకటిస్తాం : టిటిజిడిఎ
కామారెడ్డి జిజిహెచ్‌లో పేషంట్‌ను ఎలుకలు కరిచిన వ్యవహారంలో డాక్టర్ ను సస్పెండ్ చేయడాన్ని టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టిటిజిడిఎ) తీవ్రంగా ఖండించింది. 24 గంటల్లో డాక్టర్ పై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే ఛలో డిఎంఇ ప్రకటిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అన్వర్ , ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతి రావు, కాశాధికారి కిరణ్ ప్రకాశ్, వైస్ ప్రెసిడెంట్‌లు డాక్టర్ కిరణ్ మాదాల, డాక్టర్ ప్రతిభా లక్ష్మి హెచ్చరించారు. రోగికి వైద్యం చేయడం వరకే వైద్యుల భాధ్యత అని, ఆసుపత్రిలో ఎలుకలు, కుక్కలు, పందులు, కీటకాలు ఉండకుండా చూడటం సానిటేషన్ సిబ్బంది, అధికారుల భాద్యత అని పేర్కొన్నారు. పేషంట్‌ను ఎలుక కరవడంపై డిఎంఇ డాక్టర్లపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో ఉన్న టీచింగ్ వైద్యులందరం దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతామని తెలిపారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కళాశాలల్లో వైద్యులందరు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News