బిజెపి సమావేశాలపై మంత్రి జగదీష్‌రెడ్డి
హైదరాబాద్ : బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో తెలంగాణలో పర్యటిస్తున్న కమలనాథులకు విజ్ఞానయాత్ర అనుభూతిని ఇస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి అన్నారు. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎనిదేళ్ళ వ్యవధిలో సాధించిన అద్భుత ప్రగతి ఫలాలు వారి వారి రాష్ట్రాలలో అమలు పరిచేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశమని అన్నారు. శుక్రవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి విలేకరులతోల మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ వైపు సూస్తేనే వణుకు పుట్టిందని అందుకే బిజెపి దండు హైదరాబాద్‌కు పయనం కట్టిందన్నారు. బిజెపిది తెలంగాణలో బలుపు కాదు వాపు అని అన్నారు. డబుల్ ఇంజన్ రోల్ అట్టర్‌ఫ్లాప్ అయ్యిందన్నారు. వైషమ్యాలు సృష్టించడానికి, అంతరాలు పెంచడానికే డబుల్ ఇంజన్లని విమర్శించారు.
అభివృద్ధి, సంక్షేమ పరిపాలనకు తెలంగాణ రోల్ మోడల్ అని పేర్కొన్నారు. . గుజరాత్‌లో విద్యుత్ రంగం దారుణంగా దిగజారిందని అన్నారు. వాట్సప్ యూనివర్శిటీల మాయా జాలం ఇకపై పనిచేయదని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఆ పార్టీని దిశా నిర్దేశం చేస్తున్న సంఘ్ పరివార్ రాజకీయ యాత్రగానో, విహార యాత్రగానో పరిగణించకుండా ఇది వారికి విజ్ఞాన యాత్రగా ఉపయోగపడుతుందని భావిస్తున్నామన్నారు. హైదరాబాద్ కేంద్రంగా నియోజకవర్గాలలో మకాం వేసి జనాన్ని తరలించాలనుకుంటున్న కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులకు క్షేత్ర స్థాయిలో ఆశించిన స్పందన లభించడం లేదని, ముఖ్యమంత్రి కెసిఆర్ మీద పెరిగిన విశ్వసనీయతకు ఇది నిదర్శనమని జగదీశ్ రెడ్డి అన్నారు.