శ్రీశైలంలో నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతాం
ఎపి సర్కార్‌పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదని, నీళ్లు ఉన్నంత కాలం జల విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తీర్మానంపై మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణా ప్రభుత్వం ఏమి చెయ్యాలన్నది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానిస్తే అమలు పరిచేంత అమాయకులు ఇక్కడ ఎవరూ లేరన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రమని ఇక్కడ ఉన్నది ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నది ఆంధ్రా సర్కార్ గుర్తురెగి మసులుకోవాలని హెచ్చరించారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి పై విద్యుత్ ఉత్పత్తి మా హక్కు అని అపమనే హక్కు ఏ కమిటీకి,కమిషన్ లకు లేదని ఆయన స్పష్టం చేశారు. పాతపద్దతిలో అరాచకాలు చేస్తాం అంటే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ రూల్స్ లేకుండా కట్టిన ప్రాజెక్టులు పోరంబోకు ప్రాజెక్టులుగా మార్చినట్లు ఇప్పుడు కూడా అలానే చేద్దాం అని అమాయకంగా పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర హక్కులు ఏమి టో, కృష్ణా నదిలో మా వాటా ఎంతనో మాకు స్పష్టంగా తెలుసు అని మా వాటలో ప్రతి నీటి చుక్కను ఎలా వాడుకోవాలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బాగా తెలుసన్నారు.ముఖ్యమంత్రి యిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుని గతంలో చేసిన తప్పులను తిరిగి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని వాళ్లకు సరయిన పద్దతిలో సేవచేయలే గాని ఇటువంటి కుప్పిగంతులు వేయడం తగదని ఆయన ఉద్బోధించారు. జిమ్మిక్కులు ఆపాలని పనిచేసినట్లు గతంలో వారి మాదిరిగా నటించకండి అంటూ హితవు పలికారు. కృష్ణా, గోదావరిలలో ఉన్న నీళ్లను ఎట్లా వాడుకోవాలో, వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లు ఎలా అందించాలో రైతులు ఎక్కడైనా రైతులేనని సముద్రం పాలయో నీళ్లను ఈ పద్దతిలో వాడుకోండి అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ మానవీయ కోణంలో గొప్ప ఆలోచనతో విజ్ఞత తో చెబితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూర్ఖంగా ఏకపక్షంగా, అహంకార పద్దతిలో పోతుందని ఆయన మండిపడ్డారు. కృష్ణాలో మా యిష్టం వచ్చినట్లు మేము చేస్తాం మేము చెప్పినట్లు మీరు చెయ్యాలి అంటూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మూర్ఖపు పద్ధతిని అవలంభించడం వారి అవివేకమే అవుతుందన్నారు. శ్రీశైలం నుండి నీళ్ళు తీసుకు పోవడం దొంగతనం కాదా? అని మంత్రి మండిపడ్డారు. ఎవరో ఆర్డర్ లు వేస్తే వినాల్సిన ఆవశ్యకత తెలంగాణా ప్రభుత్వానికి లేదన్నారు. మూడోవ్యక్తి అవసరమే లేకుండా ఇద్దరమే కూర్చుని మాట్లాడుకుందాం అని ముందుగా చెప్పిందే ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.ఎవరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేకుండా తనకున్న అనుభావాన్ని రంగరించి చెబితే వినకుండా విజ్ఞత కోల్పోయిన ఏపి సర్కార్ కుప్పిగంతులు వేస్తుందన్నారు. ఇది తెలంగాణా అని, పాతరోజులు కావని, ఒకప్పుడు తెలంగాణా నాయకత్వాన్ని మీ బానిసలుగా మార్చుకుని చేసినట్లు చేస్తే చూస్తూ ఊరుకునేంత అమాయకులు ఇక్కడ ఎవరు లేరన్నారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పధకం ముమ్మాటికి అక్రమమేనని, దుర్మార్గంగా పోతిరెడ్డిపాడు ను వెడల్పు చేసి ప్రయత్నంలో నిజం లేదా అని ఆయన ఎపి సర్కార్ ను సూటిగా ప్రశ్నించారు. రాజకీయ చతురత తోటే ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా కానీ పరిష్కారాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వల్ప వ్యవధిలో తేల్చిపడేశారని, తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సులబతరమయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారింది అంటేనే సిఎం కెసిఆర్ చూపిన రాజకీయ చతురత తోటే సాధ్యమైందన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదనే అక్కడి ప్రభుత్వానికి సోయి లేదని అక్కడయాన ఇక్కడి ప్రజలకు ఏమి చేస్తారని ఆయన ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణాకు అతిధులని వారి బాగోగులు ఎలా చేసుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత మరొకరికి తెలియదన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిని అతిధులుగా చూసుకోవాలని ఉద్బోధించా రన్నారు. అంతే కాదు వందల దేశాల కిందట వచ్చి స్థిరపడిన వారిని అంతే చూసుకుంటున్నామన్నారు. సమావేశంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్,టి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Minister Jagadish Reddy fires on AP Govt