Sunday, November 17, 2024

మునిగిపోయే పడవలో ఈటల ఎక్కారు: జగదీష్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మునిగిపోయే పడవలో ఈటల ఎక్కారు
బిజెపి పార్టీ అన్నింటిలో విఫలమైంది
హుజూరాబాద్ ప్రజలకు ఈటల ద్రోహం చేస్తున్నారు
హుజురాబాద్ ప్రజలు కెసిఆర్ వెంటే ఉన్నారు
రాజేందర్ బిజెపితో పాటే మునిగిపోతారు
తనకు కూడా ఈటల గతే పడుతుందని కొందరు శత్రువులు కలలు కంటున్నారు
కలలో కూడా అది జరగదు: మంత్రి జి. జగదీష్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి పార్టీ అన్నింటిలో విఫలమైందని, మునిగిపోయే పడవలో ఈటల ఎక్కారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈటలతో బిజెపిలో చేరే వారు కూడా మునిగిపోయే వారేనని పేర్కొన్నారు. ఈటల బిజెపిలో చేరడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈటల చెప్పిన మాటలకు, చేసే పనులకు పొంతన లేదని విమర్శించారు. ఆయన బిజెపిలో చేరి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారు అంటూ జగదీష్ రెడ్డి మండి పడ్డారు. కేంద్రం తీరుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో సోమవారం ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, ఎంఎల్‌ఎలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గ్యాదరి కిశోర్, మల్లయ్య యాదవ్, భాస్కర్‌రావులతో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ హిట్లర్ వారసుల సరసన చేరారని విమర్శించారు. నేతి బీర కాయలో నేతి చందంగా ఆయన వైఖరి ఉందని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌లో ఈటలకు పెద్దగా సమస్యలు లేవని, కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమయ్యేవని అన్నారు. ప్రతి పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండడం సహజమని పేర్కొన్నారు. మొన్నటి దాకా ఈటల బిజెపిని తిట్టారని, ఇప్పుడు ఆ పార్టీ ఏం మారిందని అందులో చేరారని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక పార్టీ బిజెపి అని, ఆ పార్టీ ఒక్క సంక్షేమ పథకం కూడా తేలేదని విమర్శించారు. హుజూరాబాద్ ప్రజలకు ఈటల ద్రోహం చేస్తున్నారు మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన బిజెపిలో చేరడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఈటలకు ముందు నుంచే ప్రత్యేక ఎజెండా ఉందని ఆయన బిజెపిలో చేరడం ద్వారా రుజువైందని చెప్పారు. హుజురాబాద్ ప్రజలు కెసిఆర్ వెంటే ఉన్నారని, రాజేందర్ బిజెపితో పాటే మునిగిపోతారని అన్నారు.
డ్బ్బై సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని ఈ ఏడేళ్లలో సిఎం కెసిఆర్ చేసి చూపించారని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఇప్పుడు ఆకలి చావులు, ఆత్మహత్యలు లేవని అన్నారు. 2014కు ముందు పరిస్థితి ఎలా ఉంది..? ఇప్పుడు ఎలా ఉంది..? అని ప్రశ్నించారు.కోటిన్నర టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ను దాటిపోయిందని పేర్కొన్నారు. విద్యుత్‌లో తెలంగాణ గుజరాత్‌ను మించిపోయిందని వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్‌ను వీడిన వాళ్లే నష్టపోతారు కానీ పార్టీకి ఏం కాదని అన్నారు. గుంపును వదిలి అడవికి పోతే సింహాల పాలు కావడమే అని పేర్కొన్నారు. ఈటల తనపై విచారణ పూర్తి అయ్యే దాకా టిఆర్‌ఎస్‌లో ఉండాల్సిందని అన్నారు. కొందరు శత్రువులు తనకు కూడా ఈటల గతే పడుతుందని కలలు కంటున్నారని, కలలో కూడా అది జరగదని మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. భూముల అమ్మకం తెలంగాణ అభివృద్ధి కోసమే అని తెలిపారు. ఎన్నికల కోసం టిఆర్‌ఎస్ నిర్ణయాలు తీసుకోదని, సంక్షేమం నిర్విరామంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన చేసే పార్టీ టిఆర్‌ఎస్ అని చెప్పారు. రేషన్ కార్డులు ఇస్తామని నాలుగు నెలల క్రితమే చెప్పామని పేర్కొన్నారు. ఎన్నికల మెనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తున్న పార్టీ టిఆర్‌ఎస్ అని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.

Minister Jagadish Reddy fires on Etela Rajender

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News