హైదరాబాద్: అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆయన తెలంగాణ భవన్ లో బుధవారం మీడియాతో మాట్లాడారు. సాగు, తాగునీరు విషయంలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. మానవాభివృద్ధి సూచీలో రాష్ట్రం ఎంతో మెరుగైందన్నారు. గత పాలకులు నల్గొండ జిల్లాకు తీరుని నష్టం చేశారని విమర్శించారు. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కొత్తగా ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదని మంత్రి తెలిపారు. నల్గొండ జిల్లా ప్రజలకు నదీ జలాలు అందించాలనే సిఎం కెసిఆర్ కల సాకారమవుతుందన్న జగదీశ్ రెడ్డి పంటల దిగుబడి అత్యధికంగా ఉన్న జిల్లాల జాబితాలో నల్గొండ ఉందన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని ఆపేందుకు కాంగ్రెస్ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతల దుర్మార్గాన్ని ఆరేళ్లలోనే టిఆర్ఎస్ రూపుమాపిందని ఆయన స్పష్టం చేశారు. 300 క్యూసెక్కుల సామర్థ్యంతోనే ఎస్ఆర్ఎస్పీని కాంగ్రెస్ చేపట్టిందని, అవినీతి వల్లే కాంగ్రెస్ ను వరుసగా రెండు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని మంత్రి పేర్కొన్నారు.