Saturday, November 23, 2024

కాంగ్రెస్, బిజెపిలకు మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : నిరుద్యోగ యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగ మార్చ్ పేరుతో కాంగ్రెస్, బిజెపిలు సాగిస్తున్న తప్పుడు ప్రచారంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. బుధవారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు లక్షా 32వేల పై చిలుకు ఉద్యోగాలను భర్తీ చేసిందని, కాంగ్రెస్, భాజపా పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో పట్టుమని ఈ నాటికి పదివేల ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. నిరుద్యోగ మార్చ్‌లు తెలంగాణ గల్లీలలో కాదని, దేశ రాజధాని ఢిల్లీలో చేయాలని అన్నారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాటతప్పిన మోడీకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సింది పోయి తెలంగాణ నిరుద్యోగ యువతను మభ్యపెట్టే చర్యలకు పాల్పడుతున్న పార్టీలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. నాలుగు ఈకలు ఉన్న కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిన పార్టీఅని ఎద్దేవా చేశారు.

అవకాశవాద రాజకీయాలకు పాల్పడే పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారని, దేశాన్ని ఏలుతున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే లీకేజీ సృష్టికర్త అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి కాంగ్రెస్ బి టీమ్ అనడానికి పలు సందర్భాలను ఉదాహరించవచ్చన్నారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలన్న మోడీ ఏడాది రెండు లక్షల మందిని వీధుల పడేసిన చరిత్ర మూటకట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడినాకనే అనేక నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందేనన్నారు. నిరుద్యోగల ఓట్లను కొల్లగొట్టేందుకు వలస పక్షులు ఆహారం కోసం వచ్చిన తీరుగా ఆయా పార్టీల నాయకులు నిరుద్యోగులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేయడాన్ని గమనించాలన్నారు.

Also Read:బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

దేశం ఈ పరిస్థితికి దిగజారడానికి కాంగ్రెస్, బిజెపిలే కారణమని అన్నారు. నిరుద్యోగులను మార్చ్‌ల పేరుతో వంచనకు గురి చేయడం చేస్తూ హడావిడి చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్, హుజూర్‌నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News