Tuesday, November 5, 2024

విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఉండదు

- Advertisement -
- Advertisement -

Minister jagadish reddy review on power supply

అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తున్న
ఘనత తెలంగాణ విద్యుత్ సంస్థలదే…
ఆటుపోట్లను అధిగమిస్తూ గ్రిడ్స్ దెబ్బతినకుండా
తెలంగాణా విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నాయ్..
305 డిటిఆర్‌లు ఫెయిల్ అయ్యాయి..
ఇప్పటికే 200 డిటిఆర్‌లను పునరుద్ధరించాం
అధికారుల సమీక్షలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి

 

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఉండబోదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. వందేళ్లలో ఎన్నడూ పడనంత వర్షపాతం నమోదవుతున్నప్పటికీ కనురెప్ప పాటు అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఘనత తెలంగాణ విద్యుత్ సంస్థలకే దక్కిందని మంత్రి కొనియాడారు. గతంలో ఇలాగే వర్షాలు పడినప్పుడు విద్యుత్ శాఖ అతలాకుతలం అయిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బుధవారం విద్యుత్ సౌధలో మంత్రి అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, జేఎండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అది ముమ్మాటికీ సిఎండిల ఘనతే
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సరిహద్దుల్లో సైనికుల్లా క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బందితో సిఎండిలు సమన్వయం చేసుకోవడంతో ఇంతటి ప్రకృతి వైపరీత్యాల్లోనూ విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగడం లేదన్నారు. అది ముమ్మాటికీ సిఎండిల ఘనతఅని ఆయన అభివర్ణించారు. ముందెన్నడూ లేని రీతిలో వర్షాలు, వరదలు సంభవించినప్పటికీ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌లను సమర్థవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణా విద్యుత్ సంస్థల కృషి అభినందనీయమని ఆయన తెలిపారు.

1800 స్థంభాలను పునరుద్ధరించాం
సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో నీరు చేరడం, ట్రాన్స్‌పోర్ట్ తదితర సమస్యలతో ఉత్పత్తి తగ్గినప్పటికీ జెన్‌కోకు సరఫరా చేస్తున్న బొగ్గు విషయంలో సమస్యలు ఉత్పన్నం కావడం లేదన్నారు. ప్రస్తుతం 6 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. విద్యుత్ సరఫరా అన్నది డైనమిక్ సిస్టమని, ఆటుపోట్లను అధిగమిస్తూ గ్రిడ్స్ దెబ్బతినకుండా పనిచేయడం తెలంగాణా విద్యుత్ సంస్థల పనితీరుకు నిదర్శనమన్నారు. తాజాగా కురుస్తున్న వర్షాలతో రెండు డిస్కంల పరిధిలో 2,300 స్తంభాలు నేలకొరిగాయని, వాటిలో ఇప్పటికే 1,800 పైచిలుకు స్థంభాలను పునరుద్ధరించామని ఆయన తెలిపారు. ఎన్‌పిడిసిఎల్ పరిధిలో ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతున్నాయని, భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని ఒక్క సర్వాయిపేట సబ్ స్టేషన్ 33/11 కెవికి సరఫరా ఆగిందన్నారు. రెండు, మూడురోజుల్లో దానిని పురుద్ధరించి విద్యుత్ సరఫరాను కొనసాగిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

రెండురోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తి
ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి రాగానే ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలతో నేడు విద్యుత్ శాఖ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. కెసిఆర్ ఆలోచనలో భాగంగా బొగ్గునిల్వలు నెలరోజులకు సరిపడా తమకు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. జయశంకర్ భూపాలపల్లిలోని సర్వాయిపేట 33/11 కెవి సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా ఆగిందన్నారు. పునరుద్ధరణ పనులను రెండురోజుల్లో పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. 305 డిటిఆర్‌లు సైతం ఫెయిల్ అయ్యాయని అందులో నుంచి 200 డిటిఆర్‌లను ఇప్పటికే పునరుద్ధరించామని ఆయన తెలిపారు. ఎక్కడా వ్యవసాయ, గృహ, కమర్షియల్, చిన్న పరిశ్రమలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జలవిద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నామని, పోచంపాడు, జూరాలలో ఇప్పటికే ఉత్పత్తి జరుగుతుందని, కృష్ణాలో వాటర్‌ఫ్లో పెరగగానే జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News