Sunday, January 19, 2025

కాంగ్రెస్ వస్తే కోతలు..వాతలే

- Advertisement -
- Advertisement -

హుజూర్‌నగర్‌ః తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యుత్ కోతలతో రైతులకు వాతలే మిగులుతాయని రాష్ట్రాన్ని అందకారంలోకి నెడతారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఐటీ,పురపాలక శాఖామాత్యులు, బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపుమేరకు గురువారం హుజూర్‌నగర్ మండలంలోని శ్రీనివాసపురం రైతువేధిక వద్ద జరిగిన రైతు సమావేశంలో హుజూర్‌నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డితో కలిసి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసీసీ నిర్ణయాన్నే బుడ్డర్‌ఖాన్‌లు, పేపర్ పులులు బహిర్గతం చేశారని మండిపడ్డారు. ఎనిమిదిగంటల విద్యుత్ సరఫరా కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండాఅని , 24 గంటల విద్యుత్ విధానం కాంగ్రెస్ చరిత్రలోనే లేదన్నారు.

24 గంటల విద్యుత్ ఇవ్వాలను కోవడమే నిజమైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఛత్తీస్‌ఘడ్‌లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా 7 గంటలే ఇస్తున్నారని అది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండానేనని పేర్కొన్నారు. బుడ్డర్ ఖాన్ నోటివెంట మూడు గంటల విద్యుత్ సరిపోతుందనడం రైతులపై వారికున్న కపట ప్రేమకు నిదర్శనమని విమర్శించారు. గుజరాత్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సరఫరా ఆరుగంటలు మాత్రమేనని, ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికి కూడా విద్యుత్ లేని గ్రామాలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు. 2014లో గులాభీ జెండాను ఎత్తుకోకపోతే ఇక్కడ కూడా అదే పరిస్ధితి ఏర్పడేదన్నారు. బడుగు,బలహీనవర్గాల వారి అభ్యున్నతి కోసం అనేక రకాల సంక్షేమ ఫలాలను అందజేస్తున్న బిఆర్‌ఎస్ పార్టీనే మళ్ళీ గెలిపించాలని కోరారు.

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఒకవేళ జరగకూడనిది జరిగితే మాత్రం ఫించన్ 200 లకు కుదింపు చేస్తారని, కళ్యాణలక్ష్మీ, షాధీముభారక్ లకు మంగళం పాడటం ఖాయమన్నారు. రైతుబంధు, రైతుభీమా పధకాలను ఎత్తివేతకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుందని,అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిఒక్క రైతు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది కొనసాగింపుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వమే శరణ్యమన్నారు.

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ..
హుజూర్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రజలను,రైతులను అప్రమత్తం చేయడం కోసమే ఈ రైతు సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. వ్యవసాయం చేయడం దండగన్న చంద్రబాబు వారసుడే రేవంత్ రెడ్డి అన్నారు. అబద్దాలతో దొరికిపోయిన దొంగలు సరిచేసుకోవడానికి కిందామీదా పడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బిజెపిలకు వ్యవసాయంపై కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. రైతేరాజు అని ఆరైతును రాజును చేసిన రాష్ట్రం యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనన్నారు. ప్రజల కోసం రైతుల కోసం అనునిత్యం ఆలోచించి వారి అభ్యున్నతికై పాడుపడుతున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే నన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో ఏ ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతుల కోసం ఆరటపడిన దాకలాలు లేవని ఏనాడు రైతుల కోసం గ్రామాలలో తిరిగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమో, రైతుల కోసమో రాజకీయాలు చేయరని వారి పార్టీ అభివృద్ది కోసమే రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తుంటారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి 24 గంటల విద్యుత్‌ను ఇస్తామని ఇతర పధకాలను తగ్గిస్తామనడం పై ప్రజలు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జడ్పిటీసీ కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అన్నెం శౌరెడ్డి, ఎంపీటీసీ ముడెం గోపిరెడ్డి, సర్పంచ్‌లు రమ్య నాగరాజు, గుజ్జుల సుజాత అంజిరెడ్డి, బిఆరెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News