బిఆర్‌ఎస్ శ్రేణులు వాస్తవాలు మాట్లాడుతుంటే అవి జీర్ణించుకోలేని ఆ పార్టీ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో కెసిఆర్ చేసిన ఆ వ్యాఖ్యలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులు ఓ ప్రకటనలో స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కెసిఆర్‌కు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో రెండు హామీలను అమలు చేశామన్నారు. పంట బోనస్, రైతు భరోసా పెంపు, 55 వేల ఉద్యోగాలు, డిఎస్సీ పోస్టింగ్‌లు ఇలా చెప్పుకుంటే పోతే అనేకం చేశామన్నారు.
ఇంకా చేస్తామన్నారు. కెసిఆర్ వ్యాఖ్యల్లో అసహనం తప్ప మరొకటి కనబడటం లేదన్నారు. అధికారం దరిదాపుల్లో కనబడక పోవడంతోనే కెసిఆర్‌లో అసహనం ఎక్కువై ఇలా మాట్లాడుతున్నారన్నారు. ఆర్థిక విధ్వంసం తర్వాత కూడా పాత పథకాలను ఒక్కటి కూడా రద్దు చేయకుండా తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. కేంద్రం ఇంకా సహకరిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కెసిఆర్ కలిసి రావాలన్నారు. తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు. బిసి రిజర్వేషన్‌ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్తామన్నారు.
ఎవరీ గ్రాఫ్ పడిపోయిందో ప్రజలకు తెలుసు: ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి
ఎవరీ గ్రాఫ్ పడిపోయిందో ప్రజలకు తెలుసనీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని, అందుకే ఇన్నాళ్లు మొహం చాటేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి అవమానం తట్టుకోలేక కెసిఆర్ ఫాంహౌస్‌కు పరిమితమయ్యారన్నారు. ఇన్ని నెలలు తెలంగాణ ప్రజలు గుర్తుకు రాలేదా? పార్టీ సంస్థాగత నిర్మాణం, సిల్వర్ జూబ్లీ మీద ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై లేదని మంత్రి జూపల్లి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదని, ఓటమి భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పోటీ చేయలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బిఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని ఆయన తెలిపారు.