Friday, January 17, 2025

పదేళ్లలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేదు:మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

గడిచిన పదేళ్లలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న కనీస అవగాహన లేకుండా వ్యవహారించారని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. మంగళవారం శాసనసభలో పర్యాటక విధానంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా అసెంబ్లీలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ గత పదేండ్లుగా వారు చేయని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక పాలసీని తీసుకువచ్చి, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని చూస్తుంటే బిఆర్‌ఎస్ నాయకులు ఏదో గొప్పగా చేసినట్లు మాట్లాడుతున్నారన్నారు. వాళ్లకు ఈ అంశంపై మాట్లాడే నైతిక అర్హత లేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారని, తెలంగాణ కోసం మీరేమీ చేశారని మంత్రి జూపల్లి ప్రశ్నించారు.

దయచేసి మీ కోసం కాదు మా కోసం కాదు, యావత్ తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం మీరందరూ సహకరించాలని మంత్రి జూపల్లి విజ్ఞప్తి చేశారు. మీరు చేయలేని పని తాము చేస్తుంటే మీకు కోపం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. మమ్మల్ని తిట్టండి కానీ, అనుభవం ఉన్న వాళ్లు సభను ఆడుకోవడం దుర్మార్గమని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన హరీష్ రావు ఏం మాట్లాడారని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. బంగారు పళ్లెంలో పెట్టి అధికారాన్ని అప్పగించామని హరీష్‌రావు మాట్లాడారని, బంగారు పళ్లెంలో ఏముందని చూస్తే అప్పుల కుప్ప, చిప్ప చేతికిచ్చారన్నారు. పర్యాటక పాలసీ తీసుకువచ్చి రాష్ట్ర ఆదాయం పెంచాలన్న ఆలోచనతో స్వల్పకాలిక చర్చ పెడితే అడ్డగించడం సరికాదని మంత్రి జూపల్లి సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News