ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో శిథిలావ తొలగింపు, డీ వాటరింగ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఓవైపు రెస్కూ టీం మరోవైపు యంత్రాలతో ఈ పనులు సమాంతరంగా కొనసాగుతున్నాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సిఎస్ శాంతి కుమారి ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌లో జరుగుతున్న సహాయక చర్యలపై శనివారం సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు, శిథిలాల తొలగింపు, డీ వాటరింగ్ పనుల పురోగతిపై రెస్కూ టీం, ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెపి క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. టన్నెల్‌లో మొత్తం 8 మంది గల్లంతు కాగా జిపిఆర్
ద్వారా ఇప్పటికే నలుగురి జాడ కనుగొన్నారని, ఆ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయని, ఆదివారం సాయంత్రంలోగా అక్కడ సహాయక చర్యలు పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ కింద మరో నలుగురి ఆనవాళ్లు కనిపించినట్లు తెలుస్తోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 200 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్వామని చెప్పుకునే బిఆర్‌ఎస్ నాయకులు తమ పదేండ్ల పాలనలో ఎస్‌ఎల్‌బిసి సొరంగాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. అప్పుడే పూర్తి చేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదేమోనని అభిప్రాయపడ్డారు. సొరంగంలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయని, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు సహాయక చర్యల్లో నిర్లక్షం ఏమీ లేదని, ఎస్‌ఎల్‌బిసిపై నిస్సిగ్గుగా రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.