Friday, November 22, 2024

ఐకాన్ బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో : కృష్ణానదిపై సొమశిల సంగమేశ్వర మధ్య డబుల్ డెక్కర్ కేబుల్ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. శనివారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి జూపల్లి సమావేశమయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణంతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని వివిధ జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణానదిపై రూ 1,082.56 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఐకానిక్ తీగల వంతెన నిర్మాణ ప్రక్రియ వివిధ కారణాల వల్ల గత రెండేళ్లుగా పెండింగ్‌తో ఉందని, నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని నితిన్ గడ్కరీని కోరారు. ఈ వంతెన నిర్మాణంతో తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణ, దేవాలయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా, రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మరింత సులువైన మార్గం ఏర్పడటంతో పాటు తెలంగాణ నుంచి తిరుపతికి కనీసం 70 80 కిలో మీటర్ల మేర దూరం తగ్గే అవకాశం ఉందని,

గంటన్నర ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని, అంతేకాకుండా ప్రయాణీకులు పడవ ప్రమాదాల బారిన పడకుండా, సురక్షిత ప్రయాణానికి దోహదపడుతుందని వివరించారు. చుట్టూ విశాలమైన శ్రీశైలం జలాశయం, నల్లమల అడవి, ఎత్తైన పర్వతాల మధ్య నిర్మించే ఈ వంతెన తెలంగాణ వైపున లలితా సోమేశ్వర ఆలయం, ఆంధ్రప్రదేశ్ వైపున సంగమేశ్వర ఆలయాన్ని చూడటానికి ఇదో కేంద్రంగా మారుతుందని తెలిపారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు పనులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని గడ్కరీకి విన్నవించారు. దీనిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి జూపల్లి తెలిపారు. అవసరమైన ప్రక్రియలన్నింటిని పూర్తి చేసి సెప్టెంబర్ నెలాఖరులోగా టెండర్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు అలంపూర్ ఎక్స్ రోడ్ నుండి నల్గొండ వరకు 203.5 కి.మీ రోడ్డు అలంపూర్, జట్రోల్, పెంట్లపల్లి, కొల్లాపూర్, లింగాల్, అచ్చంపేట, హాజీపూర్, డిండి, దేవరకొండ మల్లేపల్లి మార్గం ద్వారా కృష్ణానది మీద 1.5 కి.మీ ప్రదాన వంతెనను కలిగి ఉండే రోడ్డును జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని గడ్కరీని కోరారు.

ఈ రహదారి నిర్మాణం వల్ల పరిశ్రమలు, వ్యవసాయ వృద్ది మార్కెటింగ్ సులభతరం అవుతుందని, రాకపోకలు మెరుగుపడి దూరం భారం తగ్గడంతో పాటు వైద్య సౌకర్యాలు మరింత చేరువ అవుతాయని, ముఖ్యంగా ఈ ప్రాంత గిరిజనులకు ఎంతో మేలు చేస్తుందని వివరించారు. వీటన్నింటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News