Wednesday, January 22, 2025

ఎన్నికల వేళ..కొత్త నాటకానికి తెర:మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తప్పు చేసిన వారే భయపడుతారని, అందుకే పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త నాటాకానికి తెర తీశారని మంత్రి జూపల్లి కృష్ఱా రావు అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో మంత్రి జూల్లి మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్ ను తిరస్కరించారని. పార్లమెంట్ ఎన్నికల్లోనూ బిఆర్‌ఎస్ ఒక్క ఎంపి సీట్ గెలుచుకునే పరిస్థితి లేదని ఆయనన్నారు. వరుస కట్టి ఆ పార్టీ లో ఉన్న ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జూపల్లి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ ఖాళీ కావడం ఖాయమని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన పరువు కాపాడుకోవడానికి కెఆర్‌ఎంబి పేరు చెప్పి కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపారని విమర్శించారు. తెలంగాణ ప్రజల అకాంక్ష మేరకు సోనియా గాంధీ నేతృత్వంలోని యూపిఎ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని చ్చిందని, 2014 లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ తెలంగాణ ప్రజల అకాంక్షలకు భిన్నంగా పరిపాలించిందని, తెలంగాణ తెచ్చుకుందే నిధులు, నియమాకాల కోసమని,

అయితే నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు బిజెపి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేక పోయాయని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఉద్యమించాల్సి పోయింది కేంద్ర ప్రభుత్వంతో చెట్టా పట్టాల్ వేసుకుని తిరిగారని ధ్వజమెత్తారు. రైతు చట్టాలు, జిఎస్‌టి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వత్తాసు పలికిందని గుర్తు చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సింది పోయి మోకారిల్లిందని బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ లో తెలంగాణ పరివాహక ప్రాంతం 68.5 శాతం అయితే సాధరణంగా నీటి కేటాయింపులు పరివాహక ప్రాంతం, కరువు నేలలు, జనాభా, సాగుయోగ్యమైన భూముల వంటి ఆంశాల ఆధారంగా జరుగుతాయని అందుకు అనుగుణంగా తెలంగాణకు 551 టిఎంసిలు, ఎపికి 260 టిఎంసిల కృష్ణా జలాలను పంచేలా డిమాండ్ చేయాల్సి ఉన్న దానికి భిన్నంగా కేవలం తెలంగాణకు 299 టిఎంసిలు ఆంధ్రప్రదేశ్ కు 512 టిఎంసిలకు ఒప్పందం కుదుర్చకుందని దుయ్యబట్టారు.

గత పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం 299 టిఎంసిల నీటి వాటాను వాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ వాటాను కూడా సరిగ్గా వాడుకోలేదన్నారు. నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ లో 2013-2014 కు ముందు దాదాపుగా 150 టిఎంసిల పైగా నీటీని తెలంగాణ వాడుకుంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చాక సగటున 85 టిఎంసిలను మాత్రమూ వాడుకుని తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. గత ఐదేండ్లలో నాగర్జున సాగర్ ప్రాజెక్టు నీటిని సగటున 35 టిఎంసిలను మిగుల్చకుని, తదుపురి సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ తో వాటా కల్పించింది మీ ప్రభుత్వం కదా అని జూపల్లి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ద్వారా 34 టిఎంసిలు వాడుకోవాల్సింది పోయి 100 టిఎంసిలకు పైగా కృష్ణా నదీ జలాలను ఇతర బేసిన్ లకు తరలించుకుపోతే బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ఆరోపించారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరోక్షంగా హక్కులు కల్పించి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తీరని అన్యాయం చేశారన్నారు.

పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యుల్‌లో లేనటువంటి పాలమూర్ – రంగారెడ్డి, దిండి, ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టులను ఆ షెడ్యూల్‌లో చేర్చామని బిఆర్‌ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో ఏనాడైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, సాధించగలిగిందా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో జిఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, వెలిగొండ, టిజిపి ప్రాజెక్ట్ లను 11వ షెడ్యుల్ ఉండగా, బిఆర్‌ఎస్ అభ్యంతరం చెప్పకపోగా కొత్తగా చేపట్టిన రాయలసీమ ఎత్తపోతల పథకం ద్వారా 8 టిఎంసిల నీటిని తరలించుకుపోవడానికి సహకరించిందన్నారు. పాలమూర్ – రంగారెడ్డి, దిండి, ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టులను అనుమతి లేని ప్రాజెక్ట్ లు అని పొందుపరిచినప్పటికీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పలేకపోయిందని జూపల్లి ప్రశ్నించారు. ఇప్పుడు అధికారం కొల్పోయిన తర్వాత తెలంగాణ ప్రజల ఉద్వేగాలను, మనోభావాలతో రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాల కోసమే కొత్తగా కెఆర్‌ఎంబి అంశాన్ని తెరపైకి తెచ్చి ఉల్టా చోర్ కొత్వాల్ డాంటే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తుందని, కెఆర్‌ఎంబికి ప్రాజెక్ట్ లను అప్పగించడానికి ఒప్పుకోలేదన్నారు.భవిష్యత్ లో కూడా ఒప్పుకోమని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో సిడబ్ల్యూసీ సభ్యలు వంశీ చంద్ రెడ్డి, ఎమ్మెల్యేలు వీర్ల పల్లి శంకర్, అనిరుధ్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News