Tuesday, September 17, 2024

చాలా మంది రైతులకు రుణ మాఫీ జరగలేదు:కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో చాలా మంది రైతులకు రుణ మాఫీ జరగలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మరోవైపు భవిష్యత్‌లో చాలా మంది రైతులకు బ్యాంకులు రుణాలిచ్చే పరిస్థితి లేదని అన్నారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు సహాయం అందిస్తామని చెప్పి ఆ హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో రుణ మాఫీ అందని వారి కోసం హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజమని వ్యాఖ్యానించారు. ఏ విడతలో కూడా రైతులకు న్యాయం జరుగడం లేదని తెలిపారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందని హామీ ఇచ్చారు.

ఎందుకు రుణమాఫీ కాలేదో మండలాల వారీగా, గ్రామాల వారీగా ప్రజలకి, రైతులకు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్షలాది రూపాయలతో రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని, వేలాది లీటరులతో పాలాభిషేకం చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ కాని వారు, రైతు భరోసా అందని రైతులు సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని చెప్పారని, రైతులకు పంట బోనస్ ఇవ్వలేదని, ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజం అని మండిపడ్దారు. మోసగించడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు వెన్నుపోటు పొడిచిందని, అందుకు ఇప్పుడు ఫలితం అనుభవించిందని అన్నారు. రైతులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలని అన్నారు. కంటి తుడుపు చర్యగా, నామ మాత్రంగా ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందని విమర్శించారు.

తొలి విడతలో భాగంగా రూ.లక్ష రుణమాఫీ చేసిన ప్రభుత్వం, రెండో విడతలో రూ.1.50 లక్షల వరకు మాఫీ చేసిందని అన్నారు. ఇక ఆగష్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, తొలి విడతలో రూ.6098 కోట్లు, రెండో విడతలో రూ.6190 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. మొత్తంగా రెండు విడతల్లో కలిపి 17 లక్షల 75 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.12 వేల 224 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని అన్నారు. సోనియా గాంధీ ప్రతి ఇంటికి లెటర్ పంపించారని, ఇప్పుడు ఆరు గ్యారంటీల అమలులో ఎందుకు చొరవ చూపడం లేదని, బడ్జెట్ మసి పూసి మారేడు కాయ చేసేలా ఉందన్నారు. రైతుకు, మహిళలకు, యువతకు, బీసీలకు వెన్నుపోటుతో మోసం చేసిందని ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీల బడ్జెట్ ను తగ్గించారని అన్నారు. బడ్జెట్‌లో గాలి లెక్కలు, నీటి మీద రాతలు అని కిషన్ రెడ్డి విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News