Sunday, November 24, 2024

‘మూసీ’కి లక్షన్నర కోట్లు అవసరం లేదు:కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు లక్షన్నర కోట్లు నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. రేస్ కోర్స్ స్థలాన్ని అమ్మి మరీ సుందరీకరణ పనులు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణకు ఎటువంటి డిపిఆర్ సిద్దం చేయకుండా ముందే అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేతలు ఎంత మాత్రం సరికాదని ఆయన పేర్కొన్నారు. కూలగొట్టిన వాటికి బ్యాంక్ ఈఎంఐలు ఎవరు కట్టాలని నిలదీశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో చిట్ చాట్ చేస్తూ పలు అంశాలను వివరించారు. మూసీ ప్రక్షాళన పేరుతో కూల్చివేతలు చేపట్టక ముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ ప్రాంతంలో పర్యటించి మూసీ నిర్వాసితులతో సీఎం ప్రజాదర్బార్ పెట్టి అక్కడ ఉన్న ప్రజలను ఒప్పించి కూల్చివేతలు చేపట్టాలని కోరారు. అలాగే మూసీ సుందరీకరణ అంటూ ఎటువంటి డిపిఆర్ సిద్ధం చేయకుండా లక్షన్నర కోట్లు ఖర్చు, హడావుడి ఏమిటని ప్రశ్నించారు.

మూసీకి రిటర్నింగ్ వాల్‌ను నిర్మించి కూడా సుందరీకరణ చేయవచ్చని కిషన్‌రెడ్డి వెల్లడించారు. అన్ని డ్రైనేజీలు మూసీలోనే కలుస్తాయని, కనీసం శుద్ధి జరగకుండా నేరుగా నదిలోనే మురుగునీరు కలుస్తోందన్నారు. తక్కువ ఖర్చుతోనే కేంద్ర ప్రభుత్వం గంగానదిని శుభ్రం చేస్తోందని ఆయన వెల్లడించారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా హైడ్రా పేరుతో కూల్చివేతలు సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి దూకుడుగా వ్యవహరిస్తామంటే కుదరదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే ప్రజలను బెదిరింపులకు, భయాందోళనకు గురి చేసిందని గుర్తు చేశారు. హైడ్రాకు గవర్నర్ చట్టబద్ధత కల్పించడం సాధారణ ప్రక్రియ అన్నారు. హైడ్రా బాధితులు ఆందోళన చెందవద్దన్నారు. మూసీ బాధితుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల ఇళ్ల కూల్చివేత సరికాదన్న ఆయన ఇక్కడి పేదలకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక్కడ నివసించే ప్రజలు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇళ్లను కొనుక్కున్నారని తెలిపారు.

అలాంటి వాటిని సరైన ప్రాతిపదిక లేకుండా కూల్చడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులను, నాలాలను కాపాడేందుకే అని చెప్పే హైడ్రా మొదట మూసీ నదిలో ఉన్న బస్సు డిపోను, మెట్రో పిల్లర్లను, మెట్రో స్టేషన్‌ను కూల్చాలని డిమాండ్ చేశారు. వాటిని కూల్చకుండా పేదల ఇళ్లు ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలు ఎవరూ కూడా తనను సంప్రదించడం లేదని స్పష్టం చేశారు. గతంలోనూ ప్రభుత్వాలు నిర్మాణాలను కూల్చివేశాయని, కానీ ఇప్పుడు పేరు మాత్రమే హైడ్రా అని మార్చారని కిషన్ రెడ్డి విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ధనవంతులు ఎవరు ఉండరని అంతా పేదవారే ఉన్నారన్నారు. మూసీ నిర్వాసితుల ఇండ్లను కూలగొట్టడం అనేది అంత తేలిక కాదని, దానికి పెద్ద సాహసమే చేయాల్సి వస్తదని అన్నారు. నిజానికి కాంగ్రెస్ హయంలోనే మూసీ పరివాహక ప్రాంతంలో ఎక్కువ శాతం నిర్మాణాలు జరిగాయన్నారు. గంగా సుందరీకరణ కోసం చాలా తక్కువ ఖర్చు చేస్తున్నామని గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళన కోసం లక్ష యాభై వేల కోట్లు అంటే ఎక్కడి నుంచి తెస్తారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. అసలు ఎందుకు అంత డబ్బు ఖర్చు అవసరపడుతుందని నిలదీశారు.

ఆర్టికల్ 370 పునరుద్దరించే అవకాశమే లేదు
జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాలపై చిట్‌చాట్‌లో కిషన్ రెడ్డి స్పందించారు. ఆ రాష్ట్రంలోని 98 శాతం హిందువుల ఓట్లు తమకే వచ్చాయని అన్నారు. కశ్మీరీ పండిట్ల ఓట్లు బీజేపీకే పడ్డాయని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు ఓ చరిత్ర అన్న ఆయన దానిని తిరిగి తీసుకువచ్చే అవకాశమే లేదని ఉద్ఘాటించారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్ మాట్లాడే ధైర్యం చేయడం లేదని, జమ్మూ కశ్మీర్లో ఆరుగురు కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఆ ఆరు మంది ముస్లింలే అని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ నుంచి గెలిచిన 29 మంది హిందువులే అని, వారిలో 19 మంది కొత్తవాళ్ళు అని అన్నారు. భద్రత విషయంలో కేంద్రప్రభుత్వ విధానంలో మార్పు లేదని తెలిపారు.

జమ్మూలో టెర్రరిజంపై మరింత జాగ్రత్తగా ఉంటామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా ఝార్ఖండ్ ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కశ్మీర్లో పాకిస్తాన్ ఆటలు ఇక మీదట సాగవని హెచ్చరించారు. కశ్మీర్ ఎన్నికల్లో వంద శాతం లక్షాన్ని చేరుకున్నామని ఆయన వివరించారు. హర్యానాలో ఈవిఎంల టాంపరింగ్ జరిగితే జమ్మూలో ఎందుకు జరగలేదు?, కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ఈవిఎంల టాంపరింగ్ ఎందుకు జరగలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. జమ్ము ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న తనకు ఉన్న సమాచారం మేరకు జమ్మూలో ఒక రకంగా ఓటర్ల పోలరైజ్ ఉందని, కశ్మీర్‌లో మరోరకంగా పోలారైజ్ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా అత్యధిక పోలింగ్ జరిగిన ఎన్నికలని తెలిపారు.

బిఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదు
బిఆర్‌ఎస్ త్వరలోనే బీజేపీతో జతకట్టబోతున్నదనే ప్రచారం జరుగుతున్న వేళ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ తో జత కట్టే అవకాశమే లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్‌ఎస్ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటుందనే ప్రచారం జరుగుతున్నదని అన్నారు. దీంతో తిరిగి రాష్ట్ర రాజకీయాల్లో బలోపేతం అయ్యేందుకు బీఆర్‌ఎస్ కమలం పార్టీతో కలిసి పని చేయబోతుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో గులాబీ పార్టీతో తమకు పొత్తుకు అవకాశమే లేదని స్వయంగా కిషన్ రెడ్డి ప్రకటన చేయడం ఆసక్తిగా మారింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడంపై కిషన్ రెడ్డి స్పందించారు. విగ్రహాన్ని కూల్చడం సరికాదని, ఈ ఘటనను తాము ఖండిస్తున్నామని అన్నారు. దీనిపై బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News