సాంస్కృతిక నిధిగా వర్ణించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
బెంగళూర్: మూడు నెలల క్రితం ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం మరోసారి ప్రధాన వార్తల్లో నిలిచింది. బెంగళూర్‌లో జరుగుతున్న సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రుల సదస్సులో ఆలయం ప్రత్యేకతలను తెలుపుతూ తెలంగాణ అధికారులు రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. 13వ శతాబ్దానికి చెందిన రామప్ప ఆలయం ఓ ఇంజినీరింగ్ అద్భుతంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. ఆరగుడుల ఎత్తుతో నక్షత్రం ఆకారంలో నిర్మించిన గోడలు, స్తంభాలు, శిల్పాలు కాకతీయుల కాలంనాటి శిల్పుల ప్రతిభా పాటవాలకు నిదర్శనంగా నిలుస్తాయి. రెండురోజులపాటు జరిగే సదస్సును కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు.
సదస్సు మొదటి రోజునే రామప్ప ఆలయం గురించి వీడియో ప్రదర్శించారు. తన ప్రారంభోపన్యాసంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆలయం విశిష్టతలను తెలియజేశారు. ఈ ఏడాది జులైలో యునెస్కో గుర్తింపు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ రామప్ప ఆలయాన్ని ఓ నిధిగా పేర్కొన్నారు. దేశంలోని దక్షిణ ప్రాంత సాంస్కృతిక సంపద గురించి ఏర్పాటు చేసిన ఈ సదస్సులో కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అండమాన్‌నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్ ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలోని 40 పురాతన కట్టడాలకు యునెస్కో గుర్తింపు దక్కగా, తెలంగాణ నుంచి రామప్ప ఆలయం అందులో ఒకటన్నది గమనార్హం.