Sunday, December 22, 2024

వేలాది రైతులకు రుణమాఫీ కాలేదు:మంత్రి కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో వేలాది మంది రైతులకు రుణ మాఫీ జరగలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. బిజెపి తరఫున పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు రైతుల నుంచి ఫోన్లు వెల్లువెత్తుతున్నాయని, తమకు రుణ మాఫీ జరగలేదని చెబుతున్నారని ఆయన తెలిపారు. రుణమాఫీకి ప్రాతిపదిక ఏమిటో తెలియట్లేదంటూ రైతులు వాపోతున్నారని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని విమర్శించారు. రుణమాఫీ కాకపోవడంతో వారంతా ఆందోళనలో ఉన్నారని అన్నారు.

వచ్చే నాలుగన్నరేళ్లు బీజేపీ నేతలు కష్టపడి పని చేయాలన్న కేంద్రమంత్రి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 36 శాతం ప్రజలు ఓట్లు వేశారని గుర్తు చేశారు. ప్రజల తీర్పును సవాలుగా తీసుకొని అంకిత భావంతో పని చేయాలని నేతలకు కిషన్‌రెడ్డి సూచించారు. ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని మోదీ 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, హర్ ఘర్ తిరంగా అంశాలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్‌ను అన్ని వర్గాలు స్వాగతం పలికేలా ఉందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News