మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తరిగాయని కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు మాత్రం పెరిగాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబానికి ఆపదొస్తే తెలంగాణ సమాజానికి ముడి పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణను దొచుకున్నది చాలదన్నట్లు ఢిల్లీలో దోస్తీ కట్టి లిక్కర్ కుంభకోణానికి తెర తీసింది అన్నారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ అసెంబ్లీలో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా పాలన కొనసాగించి, నేడు మహిళా బిల్లు గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు అలినట్లు ఉందన్నారు. నరేంద్రమోడీ 2014 అధికారంలోకి వచ్చిన నాడు దేశంలో మహిళల కంటే పురుష జనాభా ఎక్కువ ఉండేది అది గుర్తించిన ప్రధాని నరేంద్రమోడీ బేటి బచావో .. బేటి పడావో అనే పథకం తీసుకువచ్చారు.
దాని ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం ఆడబిడ్డలు విద్యను అభ్యసించే దిశగా పాలన కొనసాగుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కేంద్ర మంత్రి వర్గంలో మహిళల స్థానం పెరిగిందన్నారు. దేశ రక్షణ రంగంలో వాయుసేన యుద్ద విమానాల విభాగానికి ఒక మహిళ నేతృత్వం వహించడం గర్వకారణమన్నారు. నరేంద్రమోడీ అట్టడుగు వర్గాలను సైతం గుర్తించి ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా నియమించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 10శాతం గిరిజన రిజర్వేషన్ చేస్తానని మాయమాటలు చెప్పి మోసం చేశారన్నారు. మొట్టమొదటిగా దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళిత సామాజిక వర్గాన్ని వెన్నుపోటు పొడిచారన్నారు. దళిత విద్యార్థులకు నేడు స్కాలర్షిప్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి దళిత విద్యార్థుల జాబితాను సరైన సమయంలో పంపకపోవడం వల్ల రూ. 300 కోట్ల పేద దళిత విద్యార్థులకు అందకుండా పోతున్నాయని అన్నారు.
దళిత బంధు టిఆర్‌ఎస్ బంద్‌గా మారిందన్నారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. ధరణి పేరుతో భూమి దోపిడి జరుగుతుందన్నారు. శాసన సభ సమావేశాలలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై సంక్షేమ పథకాలపై చర్చించడం లేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీని తిట్టడానికే సమావేశాలు జరుపుతున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా భూముల సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించి గుణాత్మకమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యం పాలన బీజేపీ అందిస్తదని అన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు స్వేచ్చ లేకుండా పోయిందని ఆయన అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ వ్యవస్థ ఒకటని, అలాంటి గవర్నర్ ఒక మహిళ అని చూడకుండా అవమానం చేస్తూ మంత్రులు మాట్లాడటం బాధకరమ్ననారు.
పేదోడికి రోగం వస్తే మరణమే శాసనంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఐదు లక్షల రూపాయలతో వైద్య పొందే అవకాశం కల్పిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో అర్హులైన పేదలు ఆ పథకం ద్వారా రేషన్ పొందలేకపోత్నునారన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు తెలంగాణలో నెలకొన్నాయన్నారు. ప్రధాని నరేంద్రమోడీని తిట్టేందుకు ఆ డబ్బులను పంజాబ్ , హర్యనా, డిల్లీ , మహరాష్ట్ర, రాష్ట్రాలలో ఖర్చుపెడుతున్నారన్నారు. ఢిల్లీ లిక్కర్స్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత తప్పు చేయకుంటే ఎందుకు తమ సెల్ ఫోన్లను పగలగొట్టారో చెప్పాలన్నారు. తమపై వచ్చిన ఆరోపణలను నిరూపించుకోవాల్సింది పోయి తెలంగాణ సభ్య సమాజానికి అంటగట్టే పరయత్నం చేస్తున్నారని విమర్శించారు.
తప్పు చేస్తే సొంత కొడుకును సైతం క్షమించని సమాజం తెలంగాణ సమాజం అన్నారు. తెలంగాణలో మేము సైతం ఉ్ననామని వారన్నారు. మరి మిగతా వారికి ఈడి సామాన్ ఎందుకు ఇస్తలేదో అర్థం చేసుకోవాలి. తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ , రాష్ట్రకార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, నాయకులు ఎగ్గని నర్సిములు, ఎన్‌పి వెంకటేష్, శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, పాండురంగారెడ్డి, అచ్చుగట్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.