అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం అమరావతి అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ”ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వయసు వచ్చినా ఇంకా బుద్ధి, జ్ఞానం మాత్రం రాలేదు. ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే వైయస్సార్ సీపీ శాసనసభ్యులు ఏదో అన్నారంటూ కుంటి, గుడ్డి సాకులు చెప్పుకుంటూ వరద ప్రభావిత ప్రాంతాల్లో సానుభూతి రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన భార్యను ఏమన్నారో కూడా చెప్పడు. నా భార్యను అవమానించారని మాత్రం చంద్రబాబు చెబుతున్నాడు. ఆవిడ పేరును మేముగానీ, మరే ఇతర సభ్యులు గానీ ప్రస్తావించలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా చంద్రబాబు వినడం లేదు. రాజకీయం చేసేందుకు ఏదో కారణం కావాలి. నాడు ఎన్టీఆర్‌ను, ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు పెద్ద దుర్మార్గుడు అని ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు కూడా తెలుసు. వారు పిలిచినా పలికే స్థితిలో లేరని.. ఆ కుటుంబంలో పుట్టిన తన భార్యను రోడ్డు మీదకు తీసుకువస్తే.. వారంతా తనకు మద్దతు ఇస్తారని, ఎన్టీఆర్‌ను ఆదరించే వారు కూడా తనకు మద్దతు ఇస్తారన్నే పన్నాగం పన్ని, రాజకీయాలు చేస్తున్నాడు. ఈఊరు లేదు, ఆ ఊరు లేదు.. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా కలిసి ఆవిడను అల్లరి అల్లరి చేస్తోన్న పరిస్థితిని చూస్తున్నాం.
తన రాజకీయ అవసరాల కోసం భార్యను కూడా రోడ్డుమీద పెట్టగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే… అది ఒక్క చంద్రబాబు నాయుడే. ఆవు చేలో మేస్తే.. దూడ కూడా అదే పనిచేస్తుంది అన్నట్టు.. చంద్రబాబు సుపుత్రుడు కూడా తన తల్లిని అవమానించారని ఊరూరా తిరిగి చెబుతున్నాడు. ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు సతీమణి పేరును అసెంబ్లీలో కానీ, బయట కానీ ఎక్కడా చెప్పలేదు. రాజకీయంగా బతకడం కోసమే చంద్రబాబు తన భార్య పేరును తెరమీదకు తెచ్చారు. ఇది చాలా దుర్మార్గపు చర్య. ఇలాంటి భర్త, కొడుకు ఉండటం ఆమె దురదృష్టంగా చెప్పవచ్చు. కడప, చిత్తూరు జిల్లాల పర్యటన సందర్బంగా.. ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు, అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కారించాలని డిమాండ్ చేయాలి, కానీ, వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏం చూశాడో, ఏం చేశాడో తెలియదు కానీ.. అక్కడకు వెళ్లగానే ఏడుపు మొహం పెట్టుకుని నా భార్యను అవమానించారంటూ మాట్లాడుతున్నారు. వరదల్లో సర్వం కొట్టుకుపోయి వాళ్లు ఇబ్బందులు పడుతుంటే.. చంద్రబాబు అక్కడ కూడా ఏదోరకంగా రాజకీయ లబ్ది పొందటం కోసం తన భార్య అంశాన్ని ప్రస్తావనకు తేవడం సిగ్గుచేటు. 40మంది చనిపోయి, ఉండానికి ఇల్లులేక, తినడానికి తిండిలేక వాళ్లు ఏడుస్తుంటే… వాళ్ల దగ్గరకు వెళ్లి మీ ఏడుపు, బాధేంటి చంద్రబాబూ…? వారు కష్టాల్లో ఉంటే, మీ పనికిమాలిన సొల్లు పురాణం అక్కడ అవసరమా?” అంటూ తీవ్రంగా మండిపడ్డాడు.
Minister Kodali Nani slams Chandrababu Naidu