Wednesday, January 22, 2025

పదేళ్లలో తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: ఆరు నెలల్లో అధికారం కోల్పోతోందని కాంగ్రెస్ పార్టీపై పిచ్చి పిచ్చిగా అవాకులు, చవాకులు పేలిస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. బిఆర్‌ఎస్ సర్వీసింగ్‌కు పోలేదని, పార్టీని స్క్రాప్‌కు అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (327 ఐఎన్‌టియుసి) అను బంధ సంఘం 2024 డైరీ, క్యాలండర్ ఆవిష్కరణ బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో గురువారం జరిగింది. ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చీఫ్ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో గత 10ఏళ్ల కాలంలో అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.

యాదాద్రి పవర్ ప్లాంటు అంచనాలను రూ. 29 వేల కోట్ల నుంచి రూ. 45 వేల కోట్ల అంచనాలకు మార్చడమే కాకుండా, ఎలాంటి టెండర్ లేకుండా కాంట్రాక్టర్ నుంచి సబ్ కాంట్రాక్టర్‌కు ఇచ్చి కమిషన్లు తిన్నారని ధ్వజమెత్తారు. ధరణి పేరుతో లక్షల కోట్లు మింగారన్నారు. ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఇతర విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలను విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో విద్యుత్ శాఖ మొత్తం మోసాలతో నడిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలు తమకు స్వాతంత్య్రం వచ్చినట్టు భావిస్తున్నారని అన్నారు. యూనియన్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. ప్రభాకర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిలేష్, సెక్రటరీ జనరల్ శ్రీధర్, వివిధ కంపెనీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఎం. సురేష్, కె. భూపాల్ రెడ్డి, పి. మహేందర్ రెడ్డి, శ్రీనివా స్, మజీద్, మాధవరావు, టాన్స్‌కో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News