తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడిచినా, తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులుబాసిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహం రాష్ట్ర రాజధానిలో లేకపోవడం బాధాకరమని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానని ఆయన ప్రకటించారు. గురువారం రవీంద్ర భారతిలో జరిగిన దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొని ఆ మహానుభావుడికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యమాలను, ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆనాటి దొడ్డి కొమురయ్య పోరాటమే స్పూర్తిగా, ఇంధనంగా పనిచేసిందని మంత్రి అన్నారు. నిజాం నిరంకుశత్వానికి, దేశ్ ముఖ్ ల వెట్టికి, ఆగడాలకు వ్యతిరేఖంగా పోరాడి వీరమరణం పొందిన వీరుడు దొడ్డి కొమురయ్య అని ఆయన కీర్తించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పోరాటం అసామాన్యమైందని ఆయన గుర్తు చేశారు. ఆనాడు దేశమంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగిపోతే, మన ప్రాంతం నిజాం పాలనలో మగ్గిపోవడం ఇష్టం లేక వీరోచిత పోరాటం చేసిన ఉద్యమ నాయకుడు దొడ్డి కొమురయ్య అని ఆయన అన్నారు. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు దొడ్డి కొమురయ్య కీర్తి సజీవంగా ఉంటుందని ఆయన అన్నారు. ఆంధ్ర మహా సభ సందేశంతో యువకులంతా ఒక్కటై ఉద్యమిస్తుంటే నిజాం సేనలు తట్టుకోలేక ఉద్యమకారులపై కాల్పులు జరపడంతో దొడ్డి కొమురయ్య చనిపోయాడని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంఎల్‌సి యెగ్గే మల్లేషం, బిసి కమీషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, కమీషనర్ బాలమాయాదేవి, చంద్రశేఖర్, అలోక్ కుమార్, మల్లయ్యభట్టుతో పాటు వివిధ బిసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.