యాదాద్రి భువనగిరి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండిండిని ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన నాలుగు గ్యారెంటీలను దశల వారీగా అమలు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ్ల కలెక్టరేట్‌లో ఆదివారం జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని, అన్ని సబ్ స్టేషన్లలలో లాగ్‌బుక్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చేందుకు యోచిస్తున్నామని, ఇది తెలంగాణకు మరొక మణిహారమని, దీని ద్వారా మరెన్నో పరిశ్రమలు వస్తాయని తెలిపారు. తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజా ప్రతినిధులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు.
పజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని, ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నిరు. రాయగిరి వద్ద పది ఎకరాల స్థలంలో రూ. 33.50 కోట్లతో చేపట్టే మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ నాలుగు రోజుల్లో పూర్తి చేసి సమర్పించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. రెండు నెలల్లో టెండర్ పనులు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నేషనల్ లెవల్లో ఏ పోటీలు జరిగినా హైదరాబాద్ దగ్గరలో ఇక్కడ నిర్వహించే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా తీసుకునే చర్యలపై సమీక్షించారు. భువనగిరి ఖిల్లాకు సంబంధించి రోప్ వే పనులు కూడా రెండు మాసాలలో టెండర్ పనులు పూర్తి చేసుకొని భువనగిరి ఖిల్లాను ఒక టూరిజం స్పాట్‌గా చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
కేంద్ర నిధులు సరిపోకపోతే రాష్ట్ర నిధులతో అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే కేంద్ర నిధులు వంద కోట్లు రిలీజ్ అయ్యాయని తెలిపారు. ఎయిమ్స్‌లో వసతులు పెంచడంలో భాగంగా రెండు టవర్స్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇంకా వసతులు పెంచుకుంటామని తెలిపారు. ధర్మారెడ్డి కాలువ, బునాదిగాని కాలువ, బస్వాపూర్, ఆర్.అండ్.ఆర్. ప్యాకేజీకి సంబంధించిన రైతుల ఆందోళనలు పరిష్కరిస్తామని, ఆర్.అండ్.ఆర్. ప్యాకేజీలో 18 ఏళ్లు దాటిన వారిని కూడా చేర్చాలని ఆదేశించామని తెలిపారు. కొలనుపాకలో రూ. 15 కోట్ల ఆర్ అండ్ బి నిధులతో బ్రిడ్జితో పాటు జైన దేవాలయం దాటే వరకు రోడ్డు వెడల్పు చేస్తామని, కొత్త రోడ్డు వేస్తామని, కొలనుపాక సెంటర్ నుండి జైన దేవాలయం వరకు స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తామని, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఈనెల 24న బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎంఎల్‌ఎ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంఎల్‌ఎ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే, జిల్లా రెవిన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ఎ. భాస్కరరావు, జి.వీరారెడ్డి, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.