ఫార్ములా ఈ-రేస్ ఉదంతంలో కేటీఆర్ చేసింది చిన్న తప్పుకాదని, ఇందులో ఆయనకు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదని ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీలలో మంత్రి కోమటిరెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేస్తూ, ఈ కేసులో కేటీఆర్‌కు బెయిల్ రాదని ఏడేండ్లు జైలులో ఉండాల్సిందేనని అన్నారు. ఈ విషయం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తెలిసేవారంతా కేటీఆర్‌కు బెయిల్ రావాలని అయ్యప్పకు మొక్కుకొని నల్లడ్రెస్‌లు వేసుకొని వచ్చారని మంత్రి ఎద్దేవా చేశారు. ఏ రకంగా చూసినా కేటిఆర్‌కు బెయిల్ వచ్చే అవకాశం లేదన్నారు. ఈ కేసులో విదేశీ సంస్థ ఇన్‌వాల్వ్ కావడంతో అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం లేదని మంత్రి అభిప్రాయపడ్డారు.
బేడీలు వేసుకొని ప్రాక్టిస్ చేస్తున్నారు : మంత్రి జూపల్లి
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వారు చేసిన అవినీతి దందాలకు బేడీలు పడకతప్పదని తెలిసే ముందుగానే వాటిని వేసుకొని ప్రాక్టిస్ చేస్తున్నారని మరో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ లాబీలలో తనను కలిసి మీడియా ప్రతినిధులతో మంత్రి పై విధంగా వ్యాఖ్యానించారు.