రెండు సంవత్సరాల్లో వరంగల్‌లో ఫ్లైట్ ఎగురుతుందని, 18 నెలల్లో ఉప్పల్, నారపల్లి ఫ్లై ఓవర్ పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో బుధవారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రామగుండం, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల గురించి కేంద్ర మంత్రి రాంమ్మోహన్ నాయుడు తో చర్చించానని ఆయన తెలిపారు. తాను, పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం పోరాడుతుంటే కెసిఆర్ తన కుటుంబంతో కలిసి సోనియా గాంధీని కలిశారన్నారు.
ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ దగ్గర ఎమోషన్ పరిస్థితి ఉందన్నారు. తాను ఒక మాట అంటే దానిని కొందరు ట్రోల్ చేస్తున్నారన్నారు. అయినా వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్ర కార్యవర్గాన్ని వేసుకోలేని అసమర్దత పార్టీ బిఆర్‌ఎస్ అని ఆయన ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన సొమ్ము ను సోషల్ మీడియాలో బిఆర్‌ఎస్ కుమ్మరిస్తుందన్నారు. కెసిఆర్ పాస్‌పోర్ట్ దొంగ , ఆయన అసెంబ్లీకి వస్తే హాడావిడి ఎందుకని ఆయన ప్రశ్నించారు.
అసెంబ్లీ సెక్రటరీపై మంత్రి పొన్నం అసహనం
మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ సెక్రటరీపై అసహనం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల దగ్గర ఉన్న పాత అసెంబ్లీ పాస్‌లను పరిశీలించిన పొన్నం ఇంకా పాత కార్డులనే ఎందుకు కొనసాగిస్తున్నారని అసెంబ్లీ సెక్రటరీని మంత్రి పొన్నం ప్రశ్నించారు. ఇంకెప్పుడు ఈ కార్డులను మారుస్తారని సెక్రటరీని మంత్రి పొన్నం అడిగారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం విలేకరులకు హామీనిచ్చారు.