Sunday, December 22, 2024

సిగ్గుచేటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ-/బోడుప్పల్ : దసరా నాటికి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బిఆర్‌ఎస్ అసమర్థ పాలనతో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఆలస్యం అయ్యాయని వ్యాఖ్యానించారు. ఆదివారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి వద్ద కారిడార్ పనులను మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్, ఉప్పల్ ఎంఎల్‌ఎ బండారి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎంఎల్‌ఎ బీర్ల అయిలయ్య, పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌తో కలిసి పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్‌ను తొలగించి నూతన కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో పదిహేను రోజులలో పనులను ప్రారంభించి ఇరవై నెలలోనే పూర్తిగా నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. కింది రోడ్డును రెండు నెలల్లో వేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లనే ఆరు సంవత్సరాలు ఆలస్యం అయిందని, మాటలు చెప్పడమే వారికి అలవాటుగా మారింది తప్పా ప్రజల కష్టాలపై ఏనాడూ సోయి లేదని ఎద్దేవా చేశారు.

ఈ రోడ్డు ఆలస్యం చేయడం వలన అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, మరికొంతమందికి కాళ్లు, చేతులు విరిగి గోస అనుభవిస్తున్నట్లు తెలిపారు. భువనగిరికి పోవాలంటే ఉప్పల్ నుండి ఘట్‌కేసర్ వెళ్లడానికే గంట సమయం పడుతుందని, పేరుకు నేషనల్ హైవే తప్పా హైవేకు పాటించాల్సిన పద్ధతులు ఏమీ పట్ట్టించుకోలేదన్నారు. ఇది కేవలం కాంట్రాక్టర్, బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల వల్లనే ఆలస్యం అయిందని, దీని గురించి పూర్తిగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి వీడియోలతో సహా ప్రెజెంటేషన్ ఇచ్చామని అన్నారు. కేంద్ర మంత్రి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిఎంఏ డైరెక్టర్ హరిచందన, ఎంఎల్‌ఎ మలిపెద్ది సుధీర్ రెడ్టి, బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News