Friday, January 24, 2025

అసెంబ్లీలో సవాళ్ల యుద్ధం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించా రు. దొంగతనం కేసులోనూ జగదీశ్వర్ రెడ్డి నిందితుడని, మదన్మోహన్ రెడ్డి హత్య కేసులో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏ2గా ఉన్నారని మంత్రి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. భిక్షం అనే వ్యక్తి హత్య కే సులో జగదీశ్వర్ రెడ్డి, ఆయన తండ్రి ఏ6, ఏ7గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాంరెడ్డి హత్య కేసులో జగదీశ్వర్ రెడ్డి ఏ3 ఉన్నారని, ఆయనను ఏడాది పాటు జిల్లా నుంచి బహిష్కరించారని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెట్రోల్‌బంక్‌లో జరిగిన దొంగతనం కేసులో జగదీశ్వర్ రెడ్డి నిందితుడని, ఎన్టీఆర్ హయాంలో మద్యం కేసులోనూజగదీశ్వర్ రెడ్డి నిందితుడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో సమావేశాల్లో భాగంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై కోమటిరెడ్డి పలు ఆరోపణలు చేశారు.

ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిపై చేసిన ఆరోపణలు నిరూపిస్తా
దీనిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి స్పందిస్తూ తనపై ఆరోపణలు నిరూపించకపోతే తమ పదవులకు రాజీనామా చేయాలని మంత్రి కోమటిరెడ్డికి సవాల్ విసిరారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నానని తెలిపారు. జగదీశ్వర్ రెడ్డిపై తాను చేసిన ఆరోపణలు నిరూపిస్తానని, ఆయనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని ఆయన పేర్కొన్నారు.

మా నాయకుడు కెసిఆర్ హరిశ్చంద్రుడే: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి
మా నాయకుడు కెసిఆర్ హరిశ్చంద్రుడే, వాళ్లలా సంచులు మోసే చంద్రుడు కాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రుడి సంచులు మోసి జైలుకు వెళ్లింది సిఎం రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. తనపైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టారని జగదీశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పెట్టిన మూడు కేసుల్లో కోర్టు తనను నిర్దోషిగా తేల్చిందని ఆయన చెప్పారు. పెట్రోల్ బంకులు, మిర్యాలగూడ కేసులు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సభ సాక్షిగా ఆరోపించారని, వాళ్లు చెప్పిన కేసులపై హౌస్ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిజమైతే ముక్కునేలకు రాసి రాజీనామా చేస్తానని, తాను మాట్లాడితే సిఎం భుజాలు ఎందుకు తడుముతున్నారని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా
మంత్రి కోమటిరెడ్డి మాట్లాడిన ప్రతి అక్షరాన్ని రికార్డుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సభాపతిని కోరారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానని ఆయన సవాల్ విసిరారు. రాజీనామా చేసిన తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రానని పేర్కొన్నారు.తనపై ఆరోపణలు నిరూపించకపోతే కోమటిరెడ్డి, సిఎం ఇద్దరు ముక్కు నేలకు రాయాలని, వారు రాజీనామా చేయాలని కూడా చేయాలని ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే సిఎం, మంత్రి కోమటిరెడ్డి రాజకీయాల్లోంచి వెళ్లిపోవాలని ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు.
మళ్లీ చర్లపల్లి జైలుకే వెళ్తామని రేవంత్ అంటున్నారు….
చర్లపల్లి జీవితం రేవంత్‌రెడ్డికి అనుభవం ఉందని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మళ్లీ చర్లపల్లి జైలుకే వెళ్తామని రేవంత్ అంటున్నారని, ఉద్యమంలో చంచల్‌గూడ జైలుకు వెళ్లిన అనుభవం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు.

అభివృద్ధి కోసమే అప్పులు చేశాం
2014 జూన్‌లో అధికారంలోకి వచ్చి నవంబర్ నాటికి 24 గంటల విద్యుత్ ఇచ్చామని ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రైతులకు ఎందుకు 24 గంటల విద్యుత్ ఇవ్వడంలేదని మంత్రిని ప్రశ్నించానని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. విద్యుత్ ఉన్నా సరఫరాకు లైన్లు, సౌకర్యాలు లేవని అధికారులు తెలిపారని ఆయన చెప్పారు. అప్పట్లో రూ.90 వేల కోట్లు పెట్టి విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేశామని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు రూ.24 వేల కోట్ల అప్పుతో విద్యుత్ రంగం తమ చేతికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా చేయాలని ఆయన ప్రశ్నించారు. అప్పులు చేయకుండా నోట్లు ముద్రించాలా అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని అసెంబ్లీలో ఆనాడే కెసిఆర్ చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఏదో కొత్త విషయం చెప్పినట్లు పదేపదే అప్పులు చేశారంటున్నారని జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు.

మా ప్రభుత్వంలోనే విద్యుత్ వినియోగం పెరిగింది
2014 ముందు మాత్రమే కరెంటు లైన్ల కింద ఇళ్ల నిర్మాణం జరిగిందని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కరెంటు లైన్ల కింద ఇళ్ల నిర్మాణం జరగలేదని ఆయన చెప్పారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 2014లో రాష్ట్రంలో వ్యక్తిగత విద్యుత్ వినియోగం 1,196 కిలో వాట్లు ఉండగా 2024లో రాష్ట్రంలో వ్యక్తిగత విద్యుత్ వినియోగం 2,349 కిలో వాట్లు అని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వంలోనే విద్యుత్ వినియోగం పెరిగిందని జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News