Sunday, December 22, 2024

సృష్టించే శక్తిని కలిగిన ప్రతి స్త్రీ దేవుడి ప్రతిరూపం

- Advertisement -
- Advertisement -

సచివాలయంలో ఉమెన్స్‌డే వేడుకల్లో అటవీ మంత్రి కొండా సురేఖ

మన తెలంగాణ / హైదరాబాద్ : మరో ప్రాణికి జన్మనివ్వడం ద్వారా సృష్టించే శక్తిని కలిగిన ప్రతి స్త్రీ దేవుడి ప్రతిరూపమని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. నేడు మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో వుమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన సచివాలయ మహిళా ఉద్యోగులనుద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు, మహిళా హక్కుల సాధనకై పోరాడుతున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మంత్రి సురేఖ అన్నారు. సృష్టికి మూలం మహిళ అని ఆ మహిళ లేనిదే సృష్టి లేనే లేదన్నారు. ప్రకృతికి మహిళ ఓ వరం లాంటిదని, అందుకే మహిళను భూదేవితో పోలుస్తారన్నారు. తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురుగా ఈ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే శక్తి మహిళలకున్నదన్నారు.

నాటి కాలంలో లాగా నేడు మహిళలపై అంతటి వివక్ష లేదని, ఇప్పుడు పిల్లలకు వారి ఇష్టానుసారంగా వారి జీవితాలను తీర్చిదిద్దుకునే స్వేచ్ఛను కుటుంబం కల్పిస్తున్నదన్నారు. ఆత్మీయానురాగాలతో మెలిగినప్పుడే పిల్లలు మనతో మనస్ఫూర్తిగా వ్యవహరిస్తారని కొండా సురేఖ పేర్కొన్నారు. వారిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ ను పెంచితే జీవితంలో ఏ కష్టం ఎదురైనా ఎదుర్కొని గొప్పగా ఎదుగుతారన్నారు.

దురలవాట్లకు దూరంగా పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత కుటుంబానిదే అని అన్నారు. ఈ సమాజంలో మహిళలకు సరైన గౌరవం, గుర్తింపు లభించి ఉంటే ప్రపంచ గమనం మరోలా ఉండేదని మంత్రి సురేఖ అన్నారు. శతాబ్దాలుగా అవమానాలు, తిరస్కరణలు, అణచివేతకు గురైనప్పటికీ, మహిళలు అన్ని రంగాల్లో తమ ఉనికిని చాటుకుంటూ, స్వయం సాధికారతను సాధిస్తున్న తీరు మహిళా శక్తిని చాటుతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి హోదాలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News