గోడలు దూకడం కెటిఆర్‌కు అలవాటని, ఆ అలవాట్లే అందరికీ ఉంటాయని కెటిఆర్ అనుకుంటున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ట్యాపింగ్ చేయడం, స్టింగ్ ఆపరేషన్లు చేయడం బిఆర్‌ఎస్ వాళ్లకు అలవాటేనని మంత్రి తెలిపారు. సిఎం మీద స్టింగ్ ఆపరేషన్ చేశారా అని మంత్రి కొండా ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి అవతలి వారి రహస్యాలను తెలుసుకోవడమే కెటిఆర్ పని సురేఖ విమర్శించారు. ఇక, సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కెటిఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదని మంత్రి ఎద్దేవా చేశారు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉంటుందని తాను అనుకోవడం లేదని, ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తారో లేదో వేచి చూడాలని మంత్రి తెలిపారు. అసెంబ్లీ లాబీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీడియాతో సోమవారం చిట్ చాట్ చేశారు.
ప్రభుత్వం కంట్రోల్‌లో యాదగిరిగుట్ట బోర్డు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిటిడి తరహాలోనే యాదగిరిగుట్ట బోర్డు ఉండాలని చట్ట సవరణ చేశామని, టిటిడికి స్వయం ప్రతిపత్తి ఉంటుందని, కానీ, యాదగిరిగుట్ట బోర్డు మాత్రం ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు పొట్టి శ్రీరాములు పేరు పెడితే తాము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయమని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వివాదాలు సృష్టంచే విధంగా బిజెపి సభ్యులు దీనిపై మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.
దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములను రక్షిస్తాం
ఆర్కీయాలజీ, దేవాదాయ, టూరిజం, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్లు యూనిట్‌గా చేస్తేనే టెంపుల్ టూరిజం పెరుగుతుందని మంత్రి కొండా చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా పురాతన దేవాలయాలను అభివృద్ధి చేయడం సాధ్యం కాద న్నారు. పురాతన ఆలయాల అభివృద్ధి కోసం రోజు దరఖాస్తులు వస్తున్నాయని, దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములను రక్షిస్తామని మంత్రి కొండా హామీనిచ్చారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు మహిళా సంఘాలకు లీజుకు ఇస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. దేవాలయాల్లో ఉన్న బంగారానికి సంబంధించిన వివరాలు తెప్పిస్తున్నామని, ఒక్క వేములవాడలోనే 60 కేజీల గోల్డ్ ఉందని, అన్నీ దేవాలయాలను ఒకే గొడుకు కిందకు తీసుకువస్తామని, ప్రతి గుడి ఖర్చులను థర్డ్ పార్టీతో ఆడిట్ చేయిస్తామని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
ఎపి సిఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కొండా
టిటిడి దర్శనాల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంప్రదింపుల నేపథ్యంలో టిటిడి బోర్డు స్పందిం చింది. ఇదే విషయంపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి సురేఖ లేఖ రాసింది. దేవాదాయ శాఖ మంత్రి సురేఖ లేఖకు సానుకూలంగా స్పందించిన ఎపి ప్రభుత్వం తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు దర్శనాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈనెల 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రనిధుల లేఖలకు దర్శనాలను కేటాయిస్తామని తెలిపింది. దీంతో ఎపి సిఎం చంద్రబాబుకి మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు పేర్కొంది.