Saturday, December 21, 2024

ఎకో టూరిజంపై కమిటీ  ఛైర్మన్‌గా మంత్రి కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా మంత్రి కొండా సురేఖ, మరో 16మంది అధికారులను సభ్యులుగా నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకో టూరిజం అభివృద్ధి కోసం కమిటీ మూడు సమావేశాల్లో ఆయా టూరిజం స్పాట్స్ ను గుర్తించాలని సూచించింది. ప్రత్యేకమైన ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. పర్యావరణానికి, వన్యప్రాణులకు ఏమాత్రం హాని కలుగకుండా ఎకో టూరిజం పాలసీని అభివృద్ధి చేస్తామన్నారు. శనివారం సచివాలయంలోని అటవీ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఎకో టూరిజం కన్సల్టేటివ్ కమిటీ ఛైర్మన్,మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఎకో టూరిజం అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సరికొత్తగా ఆవిష్కరించనున్నామన్నారు. రాష్ట్రంలోని 12 సర్కూట్‌లలో 40 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించినట్లు వివరించారు. అడ్వెంచర్, రీక్రియేషన్, ఆధ్మాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ అండ్ వైల్డ్ లైఫ్, హెరిటేజ్ అండ్ కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని ఎకో టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎకో టూరిజం పాలసీ రూపకల్పనలో అటవీ, దేవాదాయ, రెవెన్యూ, పర్యాటక శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఆర్కియాలజీ శాఖతో సంప్రదింపులు జరిపి రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాల్లో పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. గత ప్రభుత్వం ఎకో టూరిజం పాలసీ రూపకల్పన పేరుతో కాలయాపన చేసిందని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. ఒడిషా, కర్నాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఎకో టూరిజం విధానాలను అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు.

ఆ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు గమనించిన పరిస్థితులను ఇక్కడి పరిస్థితులతో బేరీజు వేసుకుని అత్యుత్తమ ఎకో టూరిజం పాలసీల రూపకల్పనకు కృషి చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. గతంలో జరిగిన సమావేశంలో ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల, వలస పక్షుల ఆవాసాలు, జీవవైవిధ్య ప్రాంతాలు, వారసత్వ కట్టడాలున్న ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన విషయాన్ని మంత్రి సురేఖ అధికారులకు గుర్తు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News