ఎంఎల్‌సి ఎన్నికలలో బిజెపి అభ్యర్ధులను గెలిపించడానికి బిఆర్‌ఎస్, బిజెపి క్రాస్ ఓటింగ్ చేయడానికి కుట్రలు పన్నుతున్నారని అటవి, దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఎంఎల్‌సి ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శక్తి గార్డెన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటేనని గత ఎంపి ఎన్నికలలో సైతం కమలం అభ్యర్థి రఘునందన్‌రావును బిఆర్‌ఎస్ వాళ్లు గెలిపించారన్నారు. బిఆర్‌ఎస్ నుండి ఏ ఒక్క అభ్యర్థిని కూడా ప్రస్తుత ఎంఎల్‌సి బరిలో నిలబెట్టకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ నిరంతరం కాంగ్రెస్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, కానీ ఏ రోజూ బిఆర్‌ఎస్‌పై ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు.
ఈ ఎంఎల్‌సి ఎన్నికలు ఎంతో కీలకమైనవని, విద్యావేత్తగా అన్ని సమస్యలు తెలిసిన నరేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దయాకర్, మాజీ ఎంఎల్‌ఎ మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ తొత్తులుగా బండి సంజయ్, కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బిజెపిని ఎదిరిస్తున్న ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. 2029లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి కావడం ఖాయమన్నారు. పది సంవత్సరాలలో బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వెనకబడి పోయిందన్నారు. ఒక్క సంవత్సరంలోనే సిఎం రేవంత్‌రెడ్డి 56 వేలకు పైగా ఉద్యోగాలు భర్త్తీ చేశారని, రానున్న మరో ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారన్నారు. కులం, మతంపై విద్వేషాలు రెచ్చగొట్టే బిజెపికి బిసిల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ప్రజలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తున్నారని, ఇప్పటికే ప్రతి గ్రామంలో ప్రభుత్వ పథకాలు దాదాపు 90 శాతం వరకు అందాయన్నారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, గంప మహేందర్, ఇమాం అత్తు, తాడురి శ్రీనివాస్‌గౌడ్, నాయిని నర్సింహారెడ్డి, ముద్దం లక్ష్మి, బొమ్మల యాదగిరి, సాకి ఆనంద్, మీసం నాగరాజు, రియాజ్, మహేందర్, చాంద్‌పాష, సూర్యవర్మ, మజర్ మాలిక్ , ఖలిం, వేణు, శ్రీనివాస్‌రెడ్డి, గయాస్, రాషేద్, శ్రీనివాస్, నర్సింలు, మధు తదితరులు ఉన్నారు.