ప్రపంచ జనాభాలో ఐదు శాతం కంటే ఎక్కువ మందికి అంటే సుమారు 43 కోట్ల మంది వినికిడి లోపంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. అంతేకాకుండా 2050 నాటికి 70 కోట్లకు పైగా వ్యక్తులు, లేదా ప్రతి పది మందిలో ఒకరు, వినికిడి లోపంతో బాధపడుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలు వెల్లడిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఒక ఇ.ఎన్.టి ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ సోమవారం గోడపత్రికను ఆవిష్కరించి, శస్త్ర చికిత్సను విజయవంతం చేసుకున్న చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అనంతరం వైద్యులను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ సరైన చర్యలు తీసుకుంటే బాల్యంలో కనీసం 60 శాతం వినికిడి లోపాన్ని నివారించవచ్చని అన్నారు.
వినికిడి సమస్యను ఆధునిక సాంకేతిక పరిజానంతో అధిగమిద్దామని తెలిపారు. ఒక శబ్ధాన్ని వినగలగడం అనేది భగవంతుడు మన అందరికి ఇచ్చిన గొప్ప వరమని ఆమె పేర్కొన్నారు. కానీ, కొన్ని ప్రత్యేక సమస్యలు వల్ల మన సమాజంలోనే కొంతమంది వినికిడి లోపాన్ని కలిగి ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అయితే, అటువంటి వారికి మనమంతా అండగా నిలిచి సహకరించాల్సిన అవసరం చాలా ఉందని మంత్రి నొక్కి చెప్పారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పలు సమస్యల్లో వినికిడి లోపమనే సమస్య కూడా చాలా ప్రధానమైనదని మంత్రి చెప్పారు. సాధారణంగా చెవి వ్యాధుల చుట్టూ ఉన్న అపోహలు తొలగించేందుకు నడుం బిగించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. వినికిడి లోపానికి గల అనేక కారణాలను సరైన జాగ్రత్తతో నివారించవచ్చని చెప్పారు. వినికిడి లోపం ఉన్నవారికి సకాలంలో, తగిన మేరకు చికిత్స చేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయవచ్చని చెప్పారు. దీనికి కావాల్సిందల్లా అవగాహన మాత్రమేనని అన్నారు.
ఏ వ్యాధికైనా ముందస్తూ వైద్య పరీక్షలు చేయించుకోవాలనీ దీనికి ప్రభుత్వ,ప్రైవేటు రంగాలకు సంబంధించిన వారితో పాటు స్వచ్ఛంద సంస్థలు సహకారం తీసుకుని అవగాహన కల్పిస్తూ, ఈ వ్యాధి నియంత్రణకూ కలసి కట్టుగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే మానవతా దృక్పథంతో ఆలోచించి రూపాయికే వైద్యం అందించే వైద్యునిగా పేరుపొందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకూ ఇవే వైద్య సేవలు అందలానే తపనతో ఆరోగ్య శ్రీకి శ్రీకారం చుట్టారనీ గుర్తు చేస్తూ, ఈ శస్త్ర చికిత్స విధానం అందరికీ అందాలనే అంశంపై మంత్రివర్గంతో పాటు సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో కూడా చర్చిస్తానని తెలిపారు. ఆరోగ్యశ్రీలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తానని మంత్రి తెలిపారు.