Tuesday, September 17, 2024

మీడియా ముఖంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి

- Advertisement -
- Advertisement -

కెటిఆర్ ట్విట్టర్, ప్రెస్ మీట్‌లో మహిళలకు క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదని తెలంగాణ మహిళా సమాజం ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. మీడియా ముఖంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని మండిపడ్డారు. బ్రేక్ డ్యాన్సులకు అలవాటుపడిన వారే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా స్వయంకృషితో ఎదిగిన గొప్ప నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ఉద్దేశించి నిన్న పార్టీ మీటింగ్‌లో తెలంగాణ మహిళలను బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకొమ్మని కెటిఆర్ చేసిన వ్యాఖ్యల పై మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ నిరంకుశ విధానాలతో విసిగి వేసారిన ప్రజలు అధికారాన్ని దూరం చేసిన బిఆర్‌ఎస్ నాయకులకు అహంకారం తగ్గలేదని అన్నారు.

మహిళల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన ఉచిత ప్రయాణ పథకం పట్ల బిఆర్‌ఎస్ నాయకులు చిన్నచూపు చూస్తున్నారని మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని మహిళలు వైద్యారోగ్య సదుపాయలు, ఇతర అవసరాల కోసం వాడుకుంటూ ఎంతో నిబ్బరంగా ఉంటున్నారని అన్నారు. క్లబ్బుల్లో, పబ్బుల్లో బ్రేక్ డ్యాన్సులు చేసిన చరిత్ర నీకుండవచ్చు గానీ, మహిళా సమాజాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి సురేఖ హెచ్చరించారు. రైతులపై బిఆర్‌ఎస్ ఒలకబోస్తున్న ప్రేమ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి సురేఖ విమర్శించారు. పదేళ్ళ పాలనలో మీరు రైతాంగానికి చేసింది ఏమీ లేదని మంత్రి అన్నారు. రుణమాఫీ, పంట నష్ట పరిహారాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి బిఆర్‌ఎస్ పార్టీ రైతులను మోసం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ అమలు చేసి చూపించిందని మంత్రి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడిని అసెంబ్లీలో మహిళలను అవమానించారని బిఆర్‌ఎస్ చేసిన కుట్ర వికటించిందని మంత్రి సురేఖ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అహరహం శ్రమించి, బిఆర్‌ఎస్ కుట్రలను ఛేదించి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగాడని అన్నారు. అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నేతృత్వంలో రాష్ట్రమంతా తిరిగి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి ఒంటిచేత్తో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని మంత్రి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిగారిని విమర్శించే నైతిక హక్కు బిఆర్‌ఎస్ పార్టీకి ఏమాత్రం లేదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News