Sunday, December 22, 2024

సానుభూతి కోసమే అడ్లూరి డ్రామా: కొప్పుల

- Advertisement -
- Advertisement -

జగిత్యాల ః ప్రజల సానుభూతి పొందేందుకే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డ్రామా ఆడుతున్నాడని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ, ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతాయని, ఎన్నికలు, ఓట్ల లెక్కింపు సందర్భంగా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదని తెలిసీ కూడా అడ్లూరి లక్ష్మన్‌కుమార్ ఎన్నికల లెక్కింపు సమయంలో అధికారులు అవినీతికి పాల్పడి తనకు అన్యాయం చేశారంటూ గగ్గోలు పెట్టడం చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ పూర్తి స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని, ఎవరికీ కొమ్ము కాసే విధంగా వ్యవహరించరన్నారు. నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లలో పోలైన ఓట్లు, లెక్కింపులో పోటీ చేసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు సరిపోయినా పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు కలవడం లేదంటూ మాట్లాడటం అడ్లూరికే చెల్లిందన్నారు.

తనకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించిన అడ్లూరి కోర్టు పరిధిలో ఉన్న అంశంపై బహిరంగంగా ఎలా మాట్లాడుతారని మంత్రి ఈశ్వర్ ప్రశ్నించారు. తనపై బురదజల్లేందుకు ప్రయత్నించి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించిన కోర్టులో ఉన్న విషయాన్ని బయట మాట్లాడవద్దనే తాను ఇంతకాలం మాట్లాడలేదన్నారు. ఎన్నికలు, లెక్కింపునకు సంబంధించి అధికారులు కోర్టుకు అందించిన వివరాలు చేతికందిన తర్వాతే తాను మాట్లాడుతున్నానని మంత్రి పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌ల నుంచి ఇవిఎంలను నేరుగా విఆర్‌కె ఇంజనీరింగ్ కాలేజికి తరలించకుండా వేరే చోట పెట్టారని, అక్కడ ట్యాంపరింగ్ జరిగిందంటూ ఆరోపించడం ఆయన అవివేకమన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకే నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌ల నుంచి వచ్చిన ఇవిఎంలను ధర్మపురి ప్రభుత్వ కళాశాలలో భద్రపరిచి అక్కడి నుంచి విఆర్‌కె ఇంజనీరింగ్ కాలేజిలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించడం జరిగిందన్నారు. ఓట్ల లెక్కింపులో మొదటి ఐదు రౌండ్లు టిఆర్‌ఎస్ ఆధిక్యం కనబరిచిందని, ఆ తర్వాత నాలుగు రౌండ్లు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరిస్తే మిగతా ఐదు రౌండ్లలో టిఆర్‌ఎస్ ఆధిక్యం కనబరిచిందన్నారు.

14వ రౌండ్‌లో ఓట్ల లెక్కింపు సందర్భంగా తప్పుడు లెక్కలు చూపి తనకు అన్యాయం చేశారంటూ మాట్లాడడం సరికాదన్నారు. రీకౌంటింగ్ చేయాలని లక్ష్మణ్‌కుమార్ కోరగా అధికారులు పలు వివిఫ్యాట్‌లను లెక్కిస్తే ఒక్క ఓటు తేడా కూడా రాలేదన్నారు. ఇంత జరిగినా తనకు అధికారులు అన్యాయం చేశారంటూ అడ్లూరి కోర్టుకు వెళ్లాడన్నారు. స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు మిస్ కాగా ఆ తాళం చెవులు నా వద్దే ఉన్నాయంటూ ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు వేసిన తాళాల సీల్‌ను ప్రతి నెలా పరిశీలించిన అడ్లూరి ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మచ్చలేని 30 యేళ్ల ప్రజా జీవితంలో ఉన్న తనపై ఆరోపణలు చేసినంత మాత్రాన ఎన్నికల్లో గెలవలేవని, ప్రజల మనస్సు గెలిచి నిలవాలని సూచించారు. తనపై అసత్య ఆరోపణలు చేసి పరువు, ప్రతిష్టకు భంగం కలిగించిన అడ్లూరిని కోర్టుకు ఈడుస్తానంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదంతా డ్రామా తప్పా మరొకటి కాదని, గత ఎన్నికల్లో గడ్డం పెంచుకుని, అంగి చించుకుని, దొంగ ఏడుపులు ఏడ్చి గెలుద్దామనుకున్నాడన్నారు. ఈసారి కూడా డ్రామా చేసి గెలవాలనుకుంటున్నాడని, ఈసారి కూడా ఆయనకు పరాభవం తప్పదన్నారు. ధర్మపురి ఎన్నికలకు సంబంధించి పాత్రికేయుల ముందు చర్చ పెడుదామని తేది, సమయం చెప్పాలంటూ మంత్రి ఈశ్వర్ అడ్లూరికి సవాల్ విసిరారు. ఈ సమావేశంలో జడ్‌పి చైర్ పర్సన్ దావ వసంత, జడ్‌పిటిసిలు బత్తిని అరుణ, గోస్కుల జలంధర్, బాదినేని రాజేందర్, రాజేందర్‌రావు, అశ్విని జాదవ్, భూమయ్య, ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News