హైదరాబాద్: ధర్మపురి ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపణలు అవాస్తవమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పులు ఈశ్వర్ మండిపడ్డారు. విషయం కోర్టు పరిధిలో ఉన్నా కూడా లక్ష్మణ్ ఆరోపణలు చేయడం సరికాదని,ఎలాంటి పిర్యాదు ఇవ్వకుండానే రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్నాడని ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు ఉంటే నిర్భయంగా చెప్పవచ్చన్నారు. ఏదో రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నాడు నోరు ఉంది కదా అని ఏదీ పడితే అది మాట్లాడితే సహించేది లేదన్నారు.కనీస అవగాహన లేకుండా అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ పబ్బం గడుపుకునే ఎత్తులు వేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
రిటర్నింగ్ అధికారి నా గెలుపును ప్రకటించినప్పుడు సంతకం పెట్టింది నీవు కాదని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని, ఏమైనా అనుమానాలు ఉంటే ఎన్నికల కమిషన్, అధికారులతో తేల్చుకోవాలని సూచించారు. ఒక మంత్రిగా ప్రభుత్వంలో కొనసాగుతూ న్యాయస్థానం అడిగిన వివరాలను తెలియ చేస్తానని, స్ట్రాంగ్ రూమ్ తాళలు కూడా ఎన్నికల అధికారుల పరిధిలో ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నిక జరిగిన నాటి నుంచి ఈవిషయం భద్రపరిచిన దగ్గరకు తాను వెళ్ళలేదని, తాను ప్రభుత్వంలో కొనసాగుతూ రీకౌంటింగ్ చేయమని ఎలా కోరుతానని కొప్పుల పేర్కొన్నారు.