మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో మసీదు, చర్చి, ఆలయం ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి, ఈ ప్రార్థనా స్థలాలను ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. వాటి ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం పరిశీలించారు. మంత్రి వెంట శాసనసభ్యులు సంజయ్ కుమార్, కోరుకంటి చందర్, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి కాంతి వేస్లి, మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ శంకర్ లూక్, తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, పలువురు క్రిస్టియన్ మైనారిటీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాలను, మతాలను గౌరవిస్తారని, అందుకే సచివాలయం ప్రాంగణంలో గుడి, మస్‌జిద్, చర్చి నిర్మాణం చేపట్టారన్నారు. గతంలో చర్చి ఉండేది కాదని, నేడు అన్ని మతాలకు, అన్ని సౌకర్యాలతో గుడి, మసీదు, చర్చి నిర్మాణం చేశారన్నారు. పనులన్నీ పూర్తయ్యాయని, శుక్రవారం సిఎం చేతులమీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుందని కొప్పుల చెప్పారు. రాజీవ్ సాగర్ మాట్లాడుతూ సచివాలయంలో అన్ని మతాలకు అన్ని సౌకర్యాలతో ప్రార్థనా మందిరాలను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత పెద్ద చర్చి నిర్మాణం చేపట్టడం గొప్ప విషయమన్నారు. గతంలో సచివాలయంలో రేకుల షెడ్‌లో చర్చి ఉండేదని, ఇప్పుడు పెద్ద చర్చి నిర్మాణం చేపట్టారన్నారు. శంకర్ లుక్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ కూడా ఇలా ప్రభుత్వ నిధులతో చర్చి కట్టించలేదన్నారు. ఒక సెక్యులర్ ముఖ్యమంత్రి ఉంటే ఇలానే పాలన ఉంటుందన్నారు. అన్ని మతాలను గౌరవించే ఏకైక ముఖ్యమ ంత్రి కెసిఆర్ అని కొనియాడారు.