Monday, December 23, 2024

కార్పొరేట్లకే నమో!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మోడీ ప్రభుత్వం పై బిఆర్‌ఎస్ అగ్రనేత, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ పేదలను విస్మరించి కార్పొరేట్ సంస్థల సేవలో కొలువుతీరుతోందని మండిపడ్డారు. దీని కోసం బిజెపి సర్కార్ ఎంతకైనా దిగజారుతోందని విమర్శించారు. తమది కామన్ మ్యాన్ ప్రభుత్వమన్న విషయాన్ని కేంద్రం పూర్తిగా మరిచిపోయిందని ధ్వజమెత్తారు.
అడ్డగోలుగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు, సెస్సులు, పన్నులతో దేశ ప్రజానీకానికి భారంగా మారిన పెట్రో ధరలను తగ్గించకుండా, కార్పొరేట్ ఆయిల్ కంపెనీలపై విండ్ ఫాల్ టాక్సులు తగ్గించిన కేంద్ర ప్రభుత్వ తీరుపై కెటిఆర్ ఆగ్రహంతో రగిలిపోయారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి దేశ ప్రజల ఆర్థిక కష్టాలు కనపడవని మండిపడ్డారు. కేవలం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనం కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ఒకవైపు సెస్సులు, సుంకాల పేరుతో పెట్రో ధరలను భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం, పెట్రో భారం నుంచి ఉపశమనం కావాలని ప్రజలు కోరితే….. ఏ మాత్రం పట్టించుకోకుండా కార్పొరేట్ ఆయిల్ కంపెనీలకు విండ్ ఫాల్ టాక్సును తగ్గించి తన దుర్మార్గపూరిత ఆర్థిక విధానాలను కేంద్రం మరోసారి బయటపెట్టుకుందని ఆరోపించారు.

కార్పొరేటర్లకు వరాలు…సామాన్యులపై భారమా?
కార్పొరేట్లకు వరాలిస్తూ, సామాన్యులపై భారం మోపడం, చమురు కంపెనీలకు లాభాలు వచ్చేలా చూస్తూ, జనం జేబులకు చిల్లులు పెట్టడమే కెటిఆర్ మండిపడ్డారు. ఇదే బిజెపి ప్రభుత్వ విధానంగా మారిందన్నారు. పెట్రోల్, డీజిల్ పై విధించిన అదనపు పన్నులు, ఎక్సైజ్ సుంకాలు, సెస్సులను తగ్గించాలని దేశ ప్రజలంతా డిమాండ్ చేస్తుంటే కనీసం పట్టించుకోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు విండ్ ఫాల్ పన్నులను తగ్గించిందని విమర్శించారు. తాజా నిర్ణయంతో తమ ప్రథమ ప్రాధాన్యత కార్పొరేట్ కంపెనీలే కాని, దేశ ప్రజలు కాదని మోడీ సర్కార్ నిరూపించుకుందన్నారు. అడ్డగోలుగా ఈ కార్పొరేట్ కంపెనీలు సంపాదించిన చమురు సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెలుతున్నాయో అందరికీ తెలుసన్నారు.

యుద్ధాన్ని బూచిగా చూపించి…
దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలకు రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపించి సామాన్య ప్రజలను బిజెపి ప్రభుత్వం దోచుకుందని కెటిఆర్ విమర్శించారు. పెట్రో రేట్లు తగ్గించడానికి రష్యా నుంచి తక్కువ రేటుకి ముడిచమురు కొంటున్నామని గప్పాలు కొట్టుకున్న మోడీ ప్రభుత్వం, ఆ ఇంధనాన్ని దేశీయ అవసరాలకు వాడకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు కార్పోరేట్ ఆయిల్ కంపెనీలకు అనుమతి ఎందుకు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రష్యా నుంచి తక్కువ ధరకు కొని, దాన్ని ఇతర దేశాలకు భారీగా ఎగుమతి చేసి కార్పోరేట్ ఆయిల్ కంపెనీలు అడ్డగోలుగా సంపాదించిన సొమ్ములపై టాక్స్ తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వ ఆంతర్యాన్ని ప్రశ్నించారు.

మోడీ తన కార్పొరేట్ మిత్రులకు చెందిన రెండు కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్రం విండ్ ఫాల్ టాక్స్‌ని తగ్గించిందని విమర్శించారు. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమరులో 3/4 వంతును శుద్ధిచేసిన కార్పోరేట్ ఆయిల్ కంపెనీలు ఆ ఇంధనాన్ని దేశంలో అమ్మకుండా విదేశాలకు ఎగమతి చేసుకున్నాయని కెటిఆర్ ఆరోపించారు. ఈ ప్రక్రియలో సాధారణ ప్రజలకు నయాపైసా లాభం కలగలేదన్నారు. తక్కువ రేటుకి రష్యా నుంచి ముడి చమురు కొనడం ద్వారా రూ. 35 వేల కోట్ల రూపాయల భారం దేశంపైన తగ్గిందని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, మరి ఆ మేరకు దేశ ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో ఎందుకు విఫలమైందో వివరించాలన్నారు.

ఒకటి, రెండు కంపెనీలకు లబ్ధి చేకూర్చడం కోసమే
కేవలం ఒకటి, రెండు ఆయిల్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం మరీ బరితెగిస్తోందని కెటిఆర్ మండిపడ్డారు. విండ్ ఫాల్ టాక్స్ తగ్గింపుతో కార్పొరేట్ కంపెనీలు జాక్ పాట్ కొట్టాయన్నరు. అయితే దేశ ప్రజలు మాత్రం విపరీతమైన పన్నుల భారాన్ని మోస్తూ కేంద్ర ప్రభుత్వానికి నిలువు దోపిడీ సమర్పించుకుంటున్నారన్నారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలు 2014 నుంచి వ్యాట్ ను ఏమాత్రం పెంచకున్నా… వ్యాట్ ను తగ్గించడం లేదని పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలను మోడీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. సెస్‌ల పేరుతో రూ. 30 లక్షల కోట్లు కొల్లగొట్టి… రాష్ట్రాల పన్నుల వాటాకు ఎసరు పెట్టిందన్నారు. పైగా రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం తిరిగి నిందలు వేస్తున్నదని మండిపడ్డారు. దేశంలో పెట్రోల్ ధరలు పెరగడానికి రాష్ట్రాల వ్యాట్ పెంపు కారణం కానే కాదన్న కెటిఆర్, మోడీ ప్రభుత్వం భారీగా పెంచిన సెస్సుల ఫలితంగానే పెట్రో రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు.

సెస్సును తగ్గిసే పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకే లభ్యం
సెస్సుల రూపంలో ఇప్పటివరకు రూ.30 లక్షల కోట్లను దేశ ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం దోచుకుందని కెటిఆర్ విమర్శించారు. ఈ సెస్స్‌ను వీటిని తగ్గిస్తే పెట్రోలు రూ. 70,డీజిల్ రూ. 60లకే ప్రజలకు అందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. తన కార్పోరేట్ మిత్రుల ప్రయోజనాల కోసం ఎన్నో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంచున్న మోడీ….కనీసంఈ ఒక్క విషయంలో దేశ ప్రజల మీద జాలి చూపించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా పెట్రో రేట్లు భారీగా తగ్గి సామాన్యుడికి లాభం కలుగుతుందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కెటిఆర్ పేర్కొన్నారు.

దేశ ప్రగతి, ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం క్షుద్ర రాజకీయాలతో కాలం గడుపుతుందని కేటీఆర్ విమర్శించారు. దేశ ప్రజలకు అత్యవసరమైన పెట్రో ధరలను తగ్గించే విషయంలో సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజలకు ఊరటనిచ్చె నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ హితపు పలికారు. ఇంతేకాదు పన్నులు,సెస్సులను పెంచి దేశ ప్రజలపైన విపరీతమైన పెట్రో భారం మోపిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పటికైనా ఆ నెపాన్ని రాష్ట్రాలపైకి అన్యాయంగా నెట్టడాన్ని ఆపాలని సూచించారు. కార్పోరేట్ కంపెనీల కోసం, బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయడం అలవాటుగా మార్చుకున్న మోడీ సర్కార్ దేశ ప్రజల కష్టాలు, ప్రయోజనాలను పట్టించుకుంటుందన్న నమ్మకం దేశ ప్రజలతో పాటు తనకు లేదన్నారు కేటీఆర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News