ఢిల్లీలో పార్టీ భవనానికి శంకుస్థాపన, సంస్థాగత కార్యక్రమాలు: కెటిఆర్
హైదరాబాద్: పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసేవారికే కమిటీల్లో ప్రాధాన్యతనిస్తామని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తేల్చి చెప్పారు. పార్టీ కమిటీల్లో కూడా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యత దక్కుతుందని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, సిఎం కెసిఆర్ ఆదేశం మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కార్యాచరణను రూపొందించామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. సెప్టెంబర్ 2వ తేదీన 12,679 గ్రామ పంచాయతీల్లో, 142 మున్సిపాలిటీలలో టిఆర్‌ఎస్ జెండా పండుగ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. జెండా పండుగతో పాటు గ్రామ కమిటీలు, వార్డు కమిటీల నిర్మాణం చేయాలని సూచించారు. అదే రోజు సిఎం కెసిఆర్ ఢిల్లీలో టిఆర్‌ఎస్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ ఆ కార్యక్రమలో పాల్గొంటారని మంత్రి కెటిఆర్ తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు గ్రామ, వార్డు కమిటీల ప్రక్రియ నిర్వహించాలి, సెప్టెంబర్ 12 నుంచి 20వ తేదీ లోపు మండల, పట్టణ కమిటీలు ఏర్పాటు చేయాలి, వీటి తర్వాత ఎంఎల్‌ఎలు, ఇంఛార్జిల సమక్షంలో జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపిక ఉంటుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. సెప్టెంబర్ 20 తర్వాత రాష్ట్ర కార్యవర్గం ఎంపిక జరుగుతుందని, ఈ కమిటీలన్నీ సెప్టెంబర్ చివరి వరకూ పూర్తవుతాయని మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్‌లో బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు ఏర్పాటు చేస్తామని కెటిఆర్ తెలిపారు. పార్టీ నియమావళి ప్రకారం క్రియాశీల సభ్యులను ఎంపిక చేస్తారన్నారు. 51 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలతో పాటు మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. అదే విధంగా సోషల్ మీడియాకు సంబంధించి ప్రత్యేకంగా కమిటీలు వేయాలని ఈ మారు నిర్ణయం తీసుకున్నామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.
మొదలు పట్టణ, మండల, నియోజకవర్గ కమిటీలు వేసుకుంటామని, తర్వాత వచ్చే స్పందనను బట్టి మిగతా కమిటీలు వేసుకుంటామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు, కమిటీలు బలంగా ఉండాలని మంత్రి కెటిఆర్ అన్నారు. కమిటీలతో పాటు అనుబంధ సంఘాలను పటిష్టం చేసుకుంటామని మంత్రి తెలిపారు. వీరందరికీ సంస్థాగత శిక్షణా కార్యక్రమాలు చేపడతామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలోని తమ పార్టీ ప్రతినిధులతో సమావేశమవుతామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని భవనం కంటే ఢిల్లీలోని టిఆర్‌ఎస్ భవనం కూడా అద్భుతంగా నిర్మిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇదే సందర్భంలో హైదరాబాద్‌లో తెలంగాణ భవన్ ఇటీవలే 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయాన్ని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.