ఆదిలాబాద్‌లోని సిసిఐ యూనిట్ పునరుద్ధరించాలని విన్నపం
రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని వెల్లడి
వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందన్న కెటిఆర్
హైదరాబాద్ : కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌కు రాష్ట్ర మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ఓ విన్నపం చేశారు. ఆదిలాబాద్‌లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్‌ను సమీక్షించి, దానిని పునరుద్ధరించాలని కోరారు. దీనికి సంబంధించి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. యూనిట్ పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. ఈ యూనిట్ పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వ తరపున అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. ఈ యూనిట్ పునరుద్ధరింపబడితే ఆదిలాబాద్‌కు చెందిన వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. మరోవైపు యూనిట్‌కు సంబంధించి టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జోగు రామన్న చేసిన ట్వీట్‌ను, వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను షేర్ చేశారు. ‘ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) పరిశ్రమను పునరుద్ధరించాలని, జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా పోరాడుతుంటే, మరోవైపు పరిశ్రమ తొలగింపునకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందం’టూ జోగు రాన్న ట్వీట్ చేశారు.