చేనేత వస్త్రాలు కళానైపుణ్యానికి, వారసత్వ
సంపదకు ప్రతీకలు, ఈ సంపదను కాపాడుతాం
రాష్ట్రం ఏర్పడక ముందు చేనేత బడ్జెట్ రూ.70 కోట్లు ఇప్పుడు రూ.1200 కోట్లు
జాతీయ చేనేత దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ చేనేత వస్త్రాలు కళానైపుణ్యానికి, వారసత్వ సంపదకు ప్రతీకలు అని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, జౌళి శాఖ మంత్రి కెటిఆ ర్ అన్నారు. ఈ వారసత్వ సంపదను కాపాడుతామన్నారు. ఈ నేపథ్యంలో చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యను ఇస్తోందన్నారు. వారి సంక్షేమం కోసం పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు చేనేత రంగానికి బడ్జెట్‌లో కే వలం రూ.70 కోట్ల కేటాయింపులు ఉండేవన్నారు. కా నీ స్వరాష్ట్రం వచ్చాక రూ.1200 కోట్ల కేటాయింపులు చే సినట్లు ఆయన వెల్లడించారు. చేనేత మిత్ర కింద నూలు, రసాయనాలు, రంగులను 50 శాతం సబ్సిడీతో కార్మికులకు అందిస్తున్నామని తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో రాయితీ ఇస్తున్నది దేశంలో ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణే అని ఆయన వెల్లడించారు.
తెలంగాణ నేతన్నకు దేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన వేడుకలకు మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చేనేతలను ప్రోత్సహించేందుకు అవార్డులను అందిస్తున్నామన్నారు. ఈ కామర్స్ ద్వారా చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు చేస్తున్నామన్నారు. టెస్కో ఆధ్వర్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో చేనేత దినోత్సనాన్ని ప్రతియేటా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో చేనేత వస్త్రాలను వారంలో ఒక రోజు విధిగా ధరించి నేతన్నలకు చేయూతనివ్వాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ సూచించారు. తాను కూడా ధరిస్తున్నానని, నా కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ధరించే విధంగా కృషి చేస్తామన్నారు. అయితే కాలానికి తగ్గట్లుగా మారితేనే పోటీ ప్రపంచంలో రాణించగలమన్నారు. ఆ దిశగా చేనేత ఉత్పత్తుల్లో అనేక రకాల డిజైన్లను తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వినూత్న కార్యక్రమాలు దేశంలోని ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం నేతన్నకు చేయూత పథకం కింద రూ.30 కోట్ల చెక్కు అందించారు.
వారం రోజుల పాటు చేనేత ప్రదర్శన
పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల ప్రదర్శన వారం రోజుల పాటు నిర్వహిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. నేతన్నలు నేచిన వస్త్రాలను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత వస్త్రాలతో ఫ్యాషన్ షో ఏర్పాటు కూడా చేస్తున్నామన్నారు. కొత్త కొత్త ఆవిష్కరణలను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.2018 నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో చేనేత కళాకారులను సత్కరించి, అవార్డులు అందిస్తున్నామని తెలిపారు. అవార్డుతో పాటు నగదు పురస్కారం రూ. 25 వేలను అందించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది 31మంది చేనేత కళాకారులను సత్కరించుకున్నట్లు ఆయన తెలిపారు.పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ నిర్వహించి, చేనేత వస్త్రాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని కెటిఆర్ తెలిపారు.
గత నాలుగు సంవత్సరాలుగా మన సంప్రదాయాన్ని, సమకాలీన మార్పులను దృష్టిలో ఉంచుకుని కొత్తకొత్త డిజైన్లతో ఈతరం, భవిష్యత్ తరం పిల్లలను ఆకట్టుకునే విధంగా డిజైన్లను రూపొందిస్తున్నాం. అలా చేయడం వల్ల పది కాలాల పాటు మనుగడ ఉంటుందనే ఉద్దేశంతో ఫ్యాషన్ షోలను నిర్వహిస్తున్నామని తెలిపారు. డబుల్ ఇక్కత్, ఆర్మూర్ పట్టుచీరలు, జరిచీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు తెలంగాణ సమాజంలో అందరి ముందు కదలాడుతున్నాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఆధునికమైన టెక్నాలజీని జోడించి కొత్త డిజైన్లను రూపొందిస్తున్నామని తెలిపారు. కొత్త కొత్త ఆలోచనలతో వచ్చే నేత కళాకారులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమ కోసం పెద్ద ఎత్తున బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నాం. నేతన్నకు చేయూత ద్వారా కార్మికులకు భరోసా ఇస్తున్నామన్నారు. నవతరాన్ని ఆకట్టుకునే విధంగా చేనేతలను తీర్చిదిద్దుతున్నాం అని ఆయన స్పష్టం చేశారు.