మధ్యప్రదేశ్‌లో తెలంగాణ కంటే మెరుగైనా
అభివృద్ధి జరిగి ఉంటే చూపించాలి
హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు. పాలనలో విఫలమైన బీమారు(BIMARU)రాష్ట్రాల్లోని బిజెపి నాయకుల చిత్తశుద్ధిని మీరు నిజంగా మెచ్చుకోవాలని సింధియాను ఉద్దేశించి కెటిఆర్ ట్వీట్ చేశారు. వారు తెలంగాణకు వచ్చి విభజన రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మీ సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో తెలంగాణ కంటే మెరుగైనా అభివృద్ధి జరిగి ఉంటే చూపించాలని మంత్రి కెటిఆర్ సింధియాకు సవాల్ విసిరారు.
దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ జనాభా.. దేశానికి 5 శాతం జిడిపిని కంట్రిబ్యూట్ చేస్తుందని కెటిఆర్ మరో ట్వీట్ చేశారు. ప్రతి తెలంగాణ పౌరుడు ఈ దేశానికి డబుల్ ఇంజిన్‌గా దోహదపడ్డాడని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లాగే బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా కష్టపడితే 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ఈ దేశం 10 ట్రిలియన్ల ఎకానమీకి చేరుకునే అవకాశం ఉండేదని కెటిఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.