Friday, January 10, 2025

ఉచితాలు రద్దు చేసే దమ్ముందా?

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీకి మంత్రి కెటిఆర్ సవాల్

ఉచిత సంక్షేమ పథకాలు లేకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? పేదల సంక్షేమ పథకాలపై మీకెందుకింత అక్కసు?
అసలు మీ దృష్టిలో ఉచితాలంటే ఏమిటి? బడుగు, బలహీనవర్గాల ప్రజలే మీ టార్గెటా? పేదలకు ఇస్తే ఉచితాలు,
పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా? కాకులను కొట్టి గద్దలకు వేయడమే కేంద్రం విధానమా? రైతు రుణమాఫీ చేదు, కార్పొరేట్
రుణమాఫీ ముద్దా? నిత్యావసరాల మీద జిఎస్‌టి బాదుడు, కార్పొరేట్లకు పన్ను రాయితీలా?

మోడీజీ.. ఉచిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయగలమని చెప్పగలరా? దమ్ముంటే దీనిపై సమాధానం చెప్పాలి. అంతేకాదు ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో, కేంద్ర ప్రభుత్వం పరిధిలో అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయడానికి పార్లమెంటులో చట్టంగానీ, రాజ్యాంగ సవరణ గానీ చేస్తారా?
                                                                                                            – కెటిఆర్,
                                                                                                          ఐటి శాఖ మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి వ్యంగ్యస్త్రాలను సం ధించారు. ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. జిఎస్‌టి పేరుతో పేదలపై పన్నుల భారం మోపుతున్న కేంద్రం..పెద్దలకు మాత్రం అనేక రా యితీలు ఇస్తోందని మండిపడ్డారు. కాకులను కొట్టి గద్దలకు వేయడమే అన్న చందంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని కెటిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పేదల సంక్షేమ పథకాలపై మోడీకి ఎందుకంత అక్కసు? అని నిలదీశారు. కాలంలో తరుచూ మోడీ ఉచిత పథకాల రద్దు పై మాట్లాడుతున్నారన్నారు. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దేశ ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి, సా మాన్యుడి బతుకు భారం చేసిన కేంద్రం.. పే దవాడి పొట్టకొట్టడానికి వేసిన కొత్త పాచిక ఈ ఉచిత పథకాల మీద చర్చ అని కెటిఆర్ మండిపడారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో మోడీ పాలనపై తనదైన సెటైర్లు వేశారు. అదే సమయంలో బిజెపి ప్రభుత్వాన్ని పలు అంశాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పగలరా అని కెటిఆర్ ప్రధానిని నిలదీశారు. దమ్ముంటే దీనిపై మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతేకాదు ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో, కేంద్ర ప్రభుత్వం పరిధిలో అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయడానికి పార్లమెంటులో చట్టంగానీ, రాజ్యాంగ సవరణ గానీ చేస్తారా అని ప్రశ్నించారు. ఒకవైపు పాలు, పెరుగు లాంటి నిత్యావసర వస్తువుల మీద కూడా జిఎస్‌టి పన్ను వేసి సామాన్యుల రక్తాన్ని జలగల్లా జుర్రుకునే ప్రణాళికలను మోడీ సర్కార్ అమలుచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు దేశంలోని పేద ప్రజల నోటి కాడి కూడును లాగేసే దుర్మార్గానికి తెగించిందన్నారు. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దేశంలో పేదరికం పెచ్చుమీరి ఇప్పుడు నైజీరియా కన్నా ఎక్కువమంది పేదలున్న దేశంగా అపకీర్తిని గడించామని ఆవేదన వ్యక్తం చేశారు. హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచి)లో నానాటికి దిగజారి 116 దేశాల్లో 101వ స్థానానికి చేరుకున్నామని కెటిఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో పుట్టిన పిల్లల్లో 35.5 శాతం మంది పోషకాహార లోపంతో పెరుగుదల సరిగ్గా లేదని కేంద్రం విడుదల చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయన్నారు. ఇంతకన్నా సిగ్గు పడాల్సిన అంశం మరోటి ఉండదన్నారు.

అప్పుల మయంగా మోడీ పాలన

మోడీ పాలన అంత అప్పుల మయంగా మారిందని కెటిఆర్ దుయ్యబట్టారు. మోడీకి ముందు పాలన సాగించిన 14 మంది ప్రధానులు కలిపి మొత్తంగా రు. 56 లక్షల కోట్ల అప్పుచేస్తే… ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే సుమారు రూ. 80 లక్షల కోట్లకు పైగా అప్పుచేసిందని ఆయన విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అడ్డూ…అదుపూ లేకుండా చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే దేశ వార్షిక రాబడిలో 37 శాతం ఖర్చు అవుతున్నదని మొన్ననే కాగ్ తీవ్ర హెచ్చరిక చేసిందని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం జిడిపిలో40 శాతానికి మించి అప్పులు చేయకూడదని కానీ మోడీ సర్కారు ఇప్పటికే 54 శాతం అప్పులు చేసిందని కాగ్ తలంటిందన్నారు. పరిస్థితి ఇలాగే పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉన్నదని కాగ్ హెచ్చరించిందన్నారు.

లక్షల కోట్లు ఎవరి బొక్కసాలకు చేర్చారు?
ఇంత సొమ్ము అప్పుగా తెచ్చిన మోడీ ప్రభుత్వం….మరి ఆ డబ్బును ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఖర్చుచేశారో చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. తెచ్చిన అప్పుతో దేశంలో ఒక్క భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కట్టిండా అని ప్రశ్నించారు. మరేదైనా జాతీయ స్థాయి నిర్మాణం చేశారా?లేక పేదల కడుపునింపే ఒక్క సంక్షేమ పథకమైనా తెచ్చారా? అని నిలదీశారు. ఇవేవీ చేయనప్పుడు మరి ఇన్ని లక్షల కోట్లు ఎవరి బొక్కసాలకు చేరిందో మోడీనే చెప్పాలన్నారు. లక్షల కోట్ల అప్పులు తెస్తారు? దానితో ప్రజోపయోగ పనులు చేయరన్నారు. పైగా పేదవాడి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా పథకాలు పెడితే ఉల్టా వారే ఫ్రీబీ కల్చర్ అంటూ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

మనది సంక్షేమ రాజ్యం
మన రాజ్యంగంలో రాసుకున్న ప్రకారం భారత దేశం ఒక ‘సంక్షేమ రాజ్యం‘ అని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను మరోసారి ప్రధానమంత్రికి గుర్తుచేస్తున్నానని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు రాజ్యం (ప్రభుత్వం) ప్రజల శ్రేయస్సు కొరకు, సామాజికాభివృద్ధి కొరకు పాటుపడుతూ, ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించేందుకు ఎల్లవేళలా పనిచేస్తుందన్నారు. పౌరులకు భరోసా ఇస్తాయన్నారు. ఈ ఆదేశిక సూత్రాల ప్రకారం భారత ప్రభుత్వం తన పౌరులందరికీ స్త్రీ, పురుష వివక్ష లేకుండా సమానంగా జీవనోపాధి కల్పించాలన్నారు. సంపద ఒక దగ్గరే కేంద్రీకృతం కాకుండా, ప్రజలందరిలో పంపిణీ జరిగేలా చూడాలన్నారు. గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకాలిచ్చి, స్వయంపాలన చేసుకోగలిగే పరిస్థితులను రాజ్యం కల్పించాలన్నారు. నిరుద్యోగులు, వృద్ధులు, అనారోగ్య పీడితులు, దిక్కు లేని వారి కోసం రాజ్యమే కనీస వసతులను కల్పించాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి వర్గాల విద్య, ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి కొరకు ప్రభుత్వం పాటుపడాల్సిన అవసరముందన్నారు. ప్రజాసంక్షేమానికి అవసరమైన ఇంకా అనేక విషయాలను ఆదేశిక సూత్రాలలో పొందుపరిచారన్నారు. వీటి సాధనకు రాజ్యం నిరంతరం కృషి చేయాల్సి ఉంటుందన్నారు.

ఆదేశిక సూత్రాల అమలులోనూ వెనకబడే ఉన్నాం
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో మనదేశం ఆదేశిక సూత్రాల అమలులో ఎంతో వెనుకబడి ఉన్నదనేది చేదు నిజమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఇంతకూ ప్రధాని మోడీ ఉచితాలు అంటూ వెక్కిరిస్తున్నది ఏ పథకాలను? అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా ప్రకృతి ప్రకోపానికి గురై, గిట్టుబాటు ధరలేక, అప్పులపాలై ఉసురుదీసుకుంటున్న రైత్ననకు ఇస్తున్న ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలనేనా మోడీ ఇవ్వొద్దు అంటున్నదని నిలదీశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి రైతులను 13 నెలల పాటు రోడ్ల మీదకు తెచ్చి అరిగోస పెట్టి 700 పైచిలుకు రైతుల బలవన్మరణానికి కారణమైన మోడీకి రైతు సంక్షేమం అనే మాటకు కూడా అర్థం తెలియదని కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని విస్మరించడంతో పాటు దేశ రైతులపై ఆర్థిక భారం మోపే నిర్ణయాలను కేంద్రం తీసుకుంటుందని ధ్వజమెత్తారు.

కేంద్రం నిర్ణయం కారణంగా ఎరువుల ధరలకు రెక్కలు
కేంద్రం అసంబద్ద నిర్ణయాల కారణంగానే దేశంలో ఎరువుల ధరలకు రెక్కలు వచ్చాయని కెటిఆర్ విమర్శించారు. ప్రస్తుత బడ్జెట్‌లో రసాయనిక ఎరువులపై ఇస్తున్న సబ్సిడీలకు కేంద్రం భారీగా కోత విధించడంతో ఎరువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇది పెనుభారం అవుతుందన్నారు. ఈ సంగతి మీ రైతు వ్యతిరేక ప్రభుత్వానికి ఎప్పటికి అర్థం అవుతుంది మోడీజీ? అని ఎద్దేవా చేశారు.

రూపాయి కిలో బియ్యంపైనా మీ అక్కసు?
దేశంలో అత్యంత పేదలుగా ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ వర్గాలకు చెందిన బడుగులకు ఒక్క రూపాయికే కిలో బియ్యం ఇవ్వడం మీదనా? మోడీ ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోందని కెటిఆర్ నిలదీశారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు స్కూళ్లలో ఉచితంగా భోజనం పెట్టడం…కేంద్రానికి కండ్ల మంటగా మారిందా? అని కెటిఆర్ మండిపడ్డారు. లేదా గురుకుల స్కూళ్లు పెట్టి పేద బిడ్డలకు ఉచిత వసతులిచ్చి వారిని మెరికల్లాగా తీర్చిదిద్దడం మోడీ నిషేధిస్తారా? అని ప్రశ్నించారు. మన భావితరం పోషకాహార లోపంతో కునారిల్లకుండా ఉండటానికి గర్భిణి స్త్రీలకు ఆరోగ్య లక్ష్మి వంటి పథకాల ద్వారా పోషకాహారం అందించడం, అమ్మఒడి 102 వాహనాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి, ప్రసూతి తరువాత పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం కెటిఆర్ కిట్ ఇవ్వడం, 13,000 నగదు సహాయం చేయడం మీ దృష్టిలో వృధా ఖర్చా అని మోడీని ఉద్దేశించి కెటిఆర్ నిలదీశారు.

మంచి నీటిని ఇవ్వడం కేంద్రానికి రుచించడం లేదు
తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక, ఉన్న నీళ్లు ఫ్లోరైడ్ విషంతో బొక్కలు అరగదీసిన గడ్డ మీద మిషన్ భగీరథ పథకం పెట్టి ఉచితంగా మంచి నీరు ఇవ్వడం మీకు (మోడీ ) రుచించడం లేదా? అని కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ మనుగడకు వ్యవసాయం తరువాత అత్యంత అవసరమైన నేతన్న చేతిలో చిల్లిగవ్వ లేక నేసిన దారాలే ఉరిపోగులుగా మారుతున్న సంక్షోభ సమయంలో వారిని ఆదుకోవడానికి నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా, బతుకమ్మ చీరల వంటి పథకాలు పెట్టడం కూడా మోడీ ప్రభుత్వానికి తప్పు అనిపించడం శోచనీయమని వ్యాఖ్యానించారు. పేదింటి బిడ్డకు పెళ్లిచేయడం ఆ తల్లితండ్రులకు భారం కావద్దు అని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ వంటి పథకాలు తెచ్చి పేదవారింట సంతోషం వెల్లివిరిసేలా చేయడం ఇకపై కొనసాగవద్దు అంటున్నారా? అని మోడీని కెటిఆర్ ప్రశ్నించారు. వేల ఏండ్లుగా వివక్షకు గురైన సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికోసం తెచ్చిన దళితబంధు పథకం అవసరం లేదా? దీనిపై సమాధానం చెప్పాలని మోడీకి ఆయన సవాల్ విసిరారు.

గత అయిదేళ్లలో వంట గ్యాస్ సిలిండర్ కూడా రీఫిల్ చేయించుకోలేని ప్రజల సంఖ్య 4.13 కోట్లు కాగా కేవలం ఒక్క సిలిండర్ మాత్రమే కొనగలిగిన వారి సంఖ్య 7.67 కోట్లు అని పేర్కొన్నారు. నిజాలు ఇలా ఉంటే గ్యాస్ సబ్సిడీని ఎత్తేయాలనే మీ దుర్మార్గమైన ఆలోచన ఎంతమంది పేదలను ఆకలిమంటల్లోకి పడదోస్తున్నదో ఎన్నడైనా ఆలోచించారా మోడీ? అని కెటిఆర్ నిలదీశారు.

పాషాణ హృదయపు ప్రభుత్వం మీది?
కోవిడ్ మహమ్మారి సమయంలో లక్షలాది మంది వలస కార్మికులు భీతావహులై పొట్టచేతబట్టుకుని, ఆకలితో అలమటిస్తూ పిల్లా పాపలతో కలిసి స్వస్థలాలకు కాలి నడకన పయనిస్తుంటే, వారి వద్ద కూడా ముక్కుపిండి రైలు టికెట్ చార్జీలు వసూలు చేసిన పాషాణ హృదయపు ప్రభుత్వం మీది (మోడీ) కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కెటిఆర్ సూచించారు. సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లలో రాయితీ ఉండదని ప్రకటించడానికి మీ ప్రభుత్వానికి మనసెలా వచ్చింది? కోట్లాది మంది వయో వృద్ధులకు మన సహాయ, సహకారాలు అవసరమన్నారు. వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు వేల కోట్ల పన్ను రాయితీలు ఇస్తున్న కేంద్రం…..దేశంలోని సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లలో రాయితీ కోసం రూ. 1500 కోట్లు కేటాయించడానికి మోడీ ప్రభుత్వాలు ఎందుకు చేతులు రావడం లేదన్నారు.

కార్పొరేట్ పెద్దలకు దోచి పెడుతున్నారు
పేద రైతన్నకు రుణమాఫీ చేస్తే ఉచితాలు తప్పు అని ఘోషించే మోడీ ప్రభుత్వం…. అదే సమయంలో కార్పొరేట్ పెద్దలకు మాత్రం అందినకాడికి దోచిపెడుతోందని మండిపడ్డారు. గత మూడేళ్లలోనే సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ ట్యాక్స్ రాయితీలు ఇచ్చిన కేంద్రం బడా బాబులకు రూ.10 లక్షల కోట్లకు పైగా బ్యాంకు అప్పులు సైలెంటుగా రైట్ ఆఫ్ చేసిందని విమర్శించారు. అదే చిన్న, సన్నకారు రైతుల అప్పుల విషయానికి వచ్చేసరికి కేంద్రం స్వరం మారిపోతుందన్నారు. కాకులను కొట్టి గద్దలకు వేయడమే మోడీ విధానం అని మండిపడ్డారు. సామాన్యుడి కడుపుగొట్టి, కార్పొరేట్లకు లబ్ది చేకూర్చడమేనా కేంద్ర లక్షమని ధ్వజమెత్తారు.

కేంద్రం విధానం ఏమిటో స్పష్టత ఇవ్వాలి
ప్రజా సంక్షేమం మీద కేంద్రం విధానం ఏమిటో దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మోడీపై ఉందని కెటిఆర్ అన్నారు. దాని మీద చర్చ పెట్టండి అని సూచించారు. బిజెపి ఎనిమిదేళ్ళ పాలనలో బడా బాబులకు మాఫీ చేసిన రుణాలు ఎన్ని?

రైతన్నకు మాఫీ చేసిన రుణాలు ఎన్ని?
బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలు రద్దు చేస్తారా? చెప్పాలన్నారు.- పేదలకు, రైతులకు, బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల బిజెపి వైఖరి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. –

సంపద పెంచడం చేతకాదు…పంచడానికి మనస్సు రాదు
సంపద పెంచాలి… పేదలకు పంచాలన్నది సిఎం కెసిఆర్ నినాదమని కెటిఆర్ అన్నారు. కానీ కేంద్రానికి సంపద పెంచడం చేతకాదు. పేదలకు సంక్షేమం కోసం దాని ఖర్చు చేయడానికి మనస్సు రాదని మండిపడ్డారు. దేశం స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఎర్ర కోట మీద త్రివర్ణ పతాకం ఎగురవేశాక జాతినుద్దేశించి మీరు చేసే ప్రసంగంలో పేదల సంక్షేమం కొరకు చేపట్టిన పథకాల కేంద్రం వైఖరి ఏమిటో స్పష్టం చేయాలన్నారు. మీ దృష్టిలో ఏది ఉచితమో, ఏది అనుచితమో ఈ దేశ ప్రజలకు వెల్లడి చేస్తారని తాను ఆశిస్తున్నానని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News