హైదరాబాద్ : భద్రతకు, భరోసాకు మారుపేరు, ప్రశాంతతకు చిరునామా తెలంగాణ అని మంత్రి కెటిఆర్ అన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో శాంతి భద్రతల నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలను ఉపయోగిస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా పటిష్టమైన శాంతిభద్రతల నిర్వహణతో పెట్టుబడులకు ఆకర్షణీయమైన రాష్ట్రంగా పేరుగాం చిందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
పోలీసులు, ఇతర సంబంధిత శాఖల్లోని సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికే తలమానికంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఉందన్నారు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థని పూర్తిగా అధునీకరించి, అవసరాల మేర పునర్‌వ్యవస్థీకరించి ఆధునిక హంగులతో కూడిన కొత్త వాహనాలతో పోలీసింగ్‌ని మరింత పటిష్ట పరించిం దన్నారు. కమిషనరేట్లు, కొత్త పోలీస్ స్టేషన్ల పెంపు, సరికొత్త జిల్లా ఎస్‌పి కార్యాలయాల భవనాలతో పోలీసు వ్యవస్థ ముఖచిత్రమే మారిపోయిం దన్నారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ’షి టీమ్స్’, ’షి క్యాబ్స్’ వంటి వినూత్న ఆలోచనలతో ఆడబిడ్డల రక్షణకి కెసిఆర్ ప్రభుత్వం భరోసానిస్తుంది. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన షి టీమ్స్ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. ప్రపంచంలో అత్యధిక సిసిటివిలతో పటిష్టమైన శాంతిభద్రతల నిర్వహణ చేస్తున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రభాగాన ఉన్నది’ అని పేర్కొన్నారు.
మతకలహాలు లేని ప్రశాంతమైన నగరంగా హైదరాబాద్‌లో ప్రజలు విరాజిల్లుతున్నారని కెటిఆర్ అన్నారు. ‘ఒకప్పుడు మత కల్లోలాలతో నష్టపోయిన హైదరాబాద్ మహానగరంలో గత తొమ్మిదేళ్లుగా ఒక్క మతకలహం కూడా లేదు. వరుసగా కొన్నేళ్ల పాటు అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ నగరం అంతర్జాతీయ గుర్తింపు పొందటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మత సామరస్య పరిరక్షణ విషయంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎనలేని సేవలు అందజేస్తున్న పోలీసులు, ఇతర సంబంధిత శాఖల్లోని ప్రతి ఒక్కరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను’ అని కెటిఆర్ ట్వీట్ చేశారు.