ఆంగ్లం స్థానంలో హిందీని అనుసంధాన భాష చేయాలన్న అమిత్‌షాకు మంత్రి కెటిఆర్ సూటి ప్రశ్న
భారతదేశం వసుధైక కుటుంబం వంటిది
భిన్నత్వంలో ఏకత్వమే దాని బలం దేశ
ప్రజలు ఏమి తినాలో, ఏమి ధరించాలో,
ఎవరిని ప్రార్ధించాలో, ఏ భాషలో మాట్లాడాలో
వారి నిర్ణయానికే వదిలేయాలి భాష
దురభిమానం, అధిపత్యం ఎదురు
తిరుగుతాయి నేను మొదట
భారతీయుడిని, ఆ తరువాతే గర్వించదగ్గ
తెలుగువాడిని, తెలంగాణ వ్యక్తిని
ఆంగ్లాన్ని నిషేధిస్తే యువత నష్టపోతారు : కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంగ్లానికి బదులు హిందీని అనుసంధాన భాషగా చేయాలని,హిందీయేతర రాష్ట్రాల ప్రజలు తమ సొంత భాషలో మాట్లాడుతూ ప్రత్యామ్నాయ భాషగా ఇంగ్లీష్‌కు బదులు హిందీని వినియోగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన సూచనపై రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కెటిఆర్ తీవ్రంగా స్పందించారు. భారతదేశం వసుధైక కుటుంబం వంటిదని, భిన్నత్వంలో ఏకత్వమే దాని బలమని, దేశ ప్రజలు ఏమి తిన్నాలో,ఏమి ధరించాలో , ఎవరిని ప్రార్థించాలో, ఏ భాషలో మాట్లాడాలో వారి నిర్ణయానికే వదిలేయాలని ఆయన అన్నారు. భాష దురభిమానం, అధిపత్యం చెలాయించడం వంటివి ఎదురుతిరుగుతాయని అమిత్‌షాకు ఆయన ఎరుకపరిచారు. ‘నేను మొదట భారతీయుడిని. ఆ తర్వాతే గర్వించదగ్గ తెలుగువాడిని, తెలంగాణ వ్యక్తిని.. నా మాతృభాష తెలుగు.
అయినా ఇంగ్ల్లీష్, హిందీ, కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలను. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అనడం, ఇంగ్లిష్ భాషను నిషేధించడం వంటివి యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి’ అని కెటిఆర్ అన్నారు. ఇప్పటికే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు భారతదేశ భిన్నత్వంపై దాడి అంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. అంతేకాదు హిందీ సామ్రాజ్య వాదం దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశాయి. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై హిందీని రుద్దటం కోసం బిజెపి ప్రయత్నాలు చేస్తోందంటూ విమర్శలు వెల్లువగా మారాయి. హిందీ భాష అధికార భాష కానీ జాతీయ భాష కాదు అని హిందీని జాతీయ భాషగా చేసే ప్రయత్నాలకు బదులు పెట్రోల్, డీజిల్ ఇతర ధరలు తగ్గించడంపై కేంద్రం ఎందుకు ఆలోచించడం లేదని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.