చలాన్ కట్టిన
కెటిఆర్
తన కారు రాంగ్ రూట్‌లో వెళ్తుండగా చలాన్ వేసిన
ట్రాఫిక్ ఎస్‌ఐకు, కానిస్టేబుల్‌కు మంత్రి కెటిఆర్ సన్మానం
వారిని కార్యాలయానికి రప్పించుకొని స్వయంగా చలాన్ కట్టిన పురపాలక
శాఖ మంత్రి రాజైనా, పేదైనా అందరికీ ఒకటేనని ప్రకటన టిఆర్‌ఎస్ కార్యకర్తలకు, నాయకులకు సరైన సందేశం ఇవ్వాలనే
ట్రాఫిక్ సిబ్బందిని అభినందించినట్టు వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : రెండు రోజుల కింద తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్ ఐ ఐలయ్యను మంత్రి కె. తారకరామారావు అభినందించారు. రాంగ్ రూట్ లో వచ్చిన తన వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని సోమవారం తన కార్యాలయానికి పిలిపించుకుని మరి అభినందనలు తెలిపారు. సామాన్య ప్రజలు అయినా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా….నిబంధనలు అందరికీ ఒకటే అని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎల్లవేళల ముందు ఉంటానన్నారు. చలాన్ విధించిన రోజు సైతం వాహనంలో తాను లేనని ఆయన పేర్కొన్నారు. అయితే బాపు ఘాట్‌లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్‌లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్‌ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్‌లకు శాలువా కప్పి అభినందించారు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్య లాంటి అధికారులకి ఎప్పుడూ తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా కెటిఆర్ వ్యాఖ్యానించారు. అలాగే తన వాహనానికి విధించిన చలాన్‌ను సైతం ఆయన చెల్లించారు. ఈ విషయంలో తమ పార్టీ కార్యకర్తలు నాయకులకు సరైన సందేశం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే ట్రాఫిక్ సిబ్బందిని అభినందించానన్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు సైతం గుర్తుకుపెట్టుకుని ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ కోరారు.