Monday, December 23, 2024

అమిత్‌షాకు సవాల్

- Advertisement -
- Advertisement -

శవం, శివం అంటూ బిజెపి మత ఘర్షణలు సృష్టించే కుట్ర
మసీదులు, గుళ్ల రాజకీయం మాని దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి
పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని మోడీ ప్రకటించింది వాస్తవం కాదా?
మాచర్ల-గద్వాల రైల్వే లైన్ మంజూరు చేస్తామని చెప్పలేదా?
వలసలతో అల్లాడిన పాలమూరు జిల్లాకు కొత్తగా 8లక్షల ఎకరాలకు సాగునీరిచ్చిన ఘనత మాదే
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కెటిఆర్

నిధుల్లో కేంద్రం వివక్ష తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా లేకపోతే ముక్కు నేలకు రాస్తావా? : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులివ్వకుండా కేంద్రం వివక్ష చూపుతోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటి ఆర్ ఆరోపించారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో రూ.119కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు మం త్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి కెటిఆర్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం అమిస్తాపూర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో కేంద్ర ప్రభుత్వంపైన, బిజెపి నేతలపై మం త్రి కెటిఆర్ ఘాటుగా విమర్శలు చేశారు. తెలంగాణకు నిధులివ్వకుండా కేంద్రం వివక్ష చూపుతోంది. ఇది అందరికీ కన్పిస్తోంది.. నేనన్న మాటలు తప్పని నిరూపిస్తే మంత్రిపదవికి రా జీనామా చేస్తా.. లేకపోతే రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా ఎంతో ఇచ్చామని చెపుతున్న కేంద్ర మంత్రి అమిత్ షా మాటలు తప్పని నిరూపిస్తే ముక్కును నేలకు రాస్తారా అంటూ కెటిఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది రూ.3.65 లక్షల కోట్లు.. కేంద్రం తిరిగి మన రాష్ట్ర ప్రభుత్వానికిఇచ్చింది రూ.1.68 లక్షల కోట్లు… కేంద్రానికి అదనంగా రూ.2 లక్షల కోట్లు మన తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో ఇస్తున్నాం..ఆ నిధులతో ఇతర రాష్ట్రాలను కేంద్రం అభివృద్ధిచేస్తోంది. ఇది నిజం కాదా ? అని ప్రశ్నించారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఇస్తామనిఇదే దేవరకద్ర నియోజకవర్గంలో గత ఎన్నికలలో స్వయంగా మోడీ ప్రకటించింది వాస్తవం కాదా?, మాచర్లగద్వాల రైల్వేలైన్ ఇస్తామని చెప్పలేదా?, కృష్ణా బేసిన్‌లో 575టిఎంసిలు వాటా ఇవ్వాలని ఎనిమిదేళ్ల నుంచి సి ఎం కెసిఆర్ అడుగుతున్నా కేంద్రం తాత్సారం చేస్తోంది నిజం కాదా?, ఇవన్ని తప్పని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నిజమైతే ముక్కు నేలకు రాస్తావా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సవాల్ విసిరారు. బిజెపి నేతలు మతం, కులం ముసుగులో ఘర్షణలు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, మసీదులు తవ్వడం, శవం ఉంటే మీదని, లింగముంటే మాదంటూ మత ఘర్షణలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. మేము కూడా ఎన్నో ఆలయాలు నిర్మించాం, యాదాద్రి లాంటి మహా పుణ్యక్షేత్రాన్ని చారిత్రాత్మకంగా తీర్చిదిద్దాం.. తమకు అన్నిమతాలు, కులాలు ముఖ్యమని, మాది తెలంగాణ కులమన్నారు.

గుళ్ళు చుట్టూ రాజకీయంమాని అభివృద్ధి పనులుచేసి పోటీపడాలని సవాల్ విసిరారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మీ బిజెపి పాలిత రాష్ట్రాల్లో చూపిస్తారా అంటూ నిలదీశారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ అభివృద్ధి పథకాలు రాష్ట్రంలో అమలవుతుంటే బిజెపి, కాంగ్రెస్ నాయకులకు కళ్లు మండుతున్నాయని విమర్శించారు. సమైఖ్య పాలనలో వలసలతో బక్కచిక్కిన పాలమూరు జిల్లా అనాథగా మారిందన్నారు. తెలంగాణ సిద్దించినందునే కొత్తగా 8లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని ఈ ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రభుత్వం ఆసుపత్రిలో సురక్షితంగా కాన్పులు జరిగేలా అన్ని చర్యలు తీసుకోవడంతోపాటు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ బిడ్డ పుడితే రూ.12వేలతో కెటిఆర్ కిట్ ఇస్తున్నామని గుర్తుచేశారు. వృద్దులకు ఆసరా పెన్సన్లు, రైతులకు రైతుబంధు, రైతు బీమా, దళిత, బిసి, మైనార్టీల అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతోపాటు, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని, ఇలాంటి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అని నిలదీశారు. మీ బిజెపి రాష్ట్రాల్లో అమలు చేయడం చేతకాక ఇక్కడ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

సొంత జాగా ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయంతో ఇళ్లు నిర్మించుకునేలా సిఎం కెసిఆర్ ప్రత్యేక జిఓ తీసుకొచ్చారని, త్వరలో మూడువేల మందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధినిచూసి ఓర్వలేక మొరుగుతున్నారని విమర్శించారు. మంత్రి కెటిఆర్ నేతృత్వంలో రాష్ట్రానికి 17వేల పరిశ్రమలను తీసుకురావడం వల్ల రూ.2.40లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. తద్వారా 16లక్షలమందికి కొత్తగా ఉద్యోగాలు దక్కాయన్నారు. మంత్రి కెటిఆర్ పరిశ్రమల శాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంకు 17 వేల పరిశ్రలము తీసుకొచ్చి. 2.40 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 16లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించారని మంత్రి వేముల తెలిపారు. ఐటి ఎగుమతుల్లో తెలంగాణ రాక ముందు 57 కోట్లు ఉంటే కెటిఆర్ వచ్చిన తర్వాత 2.80 కోట్లుకు పెరిగిందన్నారు. ప్రపంచ స్థాయిలో ఉన్న ఐదు పరిశ్రమల కార్యాలయాలను అమెరికా తర్వాత తెలంగాణలో ఏర్పాటు చేసేలా చేశారని చెప్పారు.

హైదరాబాద్ అభివృద్దికి రూ.10వేల కోట్లతో కెటిఆర్ అభివృద్ధి చేస్త్తున్నారని, ప్రపంచస్థాయి వసతులతో హైదారాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఇవేవి కనిపించని కొందరు మొరుగుతున్నారని వాటిని తాము పట్టించుకోబోమన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కెసిఆర్‌లేని తెలంగాణ ఉద్యమాన్ని ఉహించుకోలేమన్నారు. తెలంగాణ ఉద్యమమే లేకపోతే రాష్ట్రం వచ్చేదికాదన్నారు. రాష్ట్రం అభివృద్ది చెందుతుంటే బిజెపి నాయకులు కుల, మత రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, అలాంటి వారి మాటలను నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్దిని చూసి మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సభలో ఎంఎల్‌ఎలు రాజేందర్‌రెడ్డి, కృష్ణమెహన్ రెడ్డి, లకా్ష్మరెడ్డి, అంజయ్య యాదవ్, ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌సిలు వాణిదేవి, కూచికుల్ల దామోదర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ నిజాం పాష, మైనారిటీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, జడ్‌పి చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News