కుటుంబసభ్యులపై నీచమైన వ్యాఖ్యలు
చేయాలని తెలంగాణ బిజెపి నేతలకు
చెబుతున్నారా? నా కుమారుడి
శరీరాకృతిపై దిగజారుడు కామెంట్లు
సిగ్గుచేటు మోడీ, అమిత్‌షాలపై మేం
కూడా ఇదే తరహాలో స్పందిస్తామని
ఎందుకు అనుకోవద్దు ఇప్పటికైనా
నిలువరించకపోతే చట్టపరమైన చర్యలు
తప్పవు : బిజెపి జాతీయ అధ్యక్షుడు
నడ్డాకు కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/ హైదరాబాద్ : బిజెపి మౌత్ పీస్ యూట్యూబ్ ఛానెల్‌లో నిర్వహించిన ఓ పబ్లిక్ పోల్‌లో తన కొడుకు పేరును ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టడంపై మంత్రి కెటిఆర్ ఆవేదన చెందారు. ఇలాంటివి చూసినప్పుడే తాను ప్రజా జీవితంలో ఉండడం కరెక్టేనా? అని అనిపిస్తుందన్నారు. ఈ సోషల్ మీడియా కాలంలో ఎవరు ఎవరిపైనైనా ఎలాంటి రుజువులు లేకుండా నిస్సిగ్గుగా బురదజల్లుతున్నారని మండిపడ్డారు. జర్నలిజం ముసుగులో 24 గంటలు చెత్తను ప్రసారం చేసే యూట్యూబ్ చానళ్లలోకి తమ పిల్లలను లాగడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. సోషల్ మీడియా జర్నలిజం పేరిట భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు సంఘ విద్రోహ చర్యలకు అడ్డాగా మారాయని మండిపడ్డారు.
సదరు చానల్ యూట్యూబ్‌లో పెట్టిన పబ్లిక్ పోల్‌ను బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు ట్యాగ్ చేస్తూ మంత్రి కెటిఆర్ ట్వీట్ పెట్టారు. తెలంగాణలోని బిజెపి నేతలకు మీరు నేర్పింది ఇదేనా? అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. బిజెపి మౌత్‌పీస్ చానల్‌లో పెట్టిన రాజకీయ పోస్ట్‌లో తన కొడుకు పేరు ప్రస్తావిస్తూ బాడీ షేమింగ్ చేయడం మీరు నేర్పిన సంస్కారమేనా అంటూ చురకలంటించారు. మీరు ఆలోచించలేదా? మేం కూడా అమిత్‌షా లేదా మోడీ ఫ్యామిలీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయగలమా? అని ప్రశ్నించారు. దయచేసి థర్డ్‌రేట్ నాయకులు, బిజెపి మౌత్‌పీస్ మీడియాలు తన పిల్లలపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయకండి అని హెచ్చరించారు. ఇదే పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, తాము కూడా ఇదే స్థాయిలో ప్రతిస్తందిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
అబద్ధాలను వ్యాప్తి చేయడం వారికే అవమానం : ఎంఎల్‌సి
ద్వేషం, అబద్దాలను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను చాలా కాలంగా ఉప యోగిస్తున్న వారికే ఇది అవమానమని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మనం చేయగలిగినది సున్నితంగా, బాధ్యతా యుతంగా ఉండడమని, మిమ్మల్ని కించపర్చడానికి కారణాలు లేకుండా పోయినప్పుడు మీ కుటుంబాన్ని లక్షంగా చేసుకుంటారని మీకు తెలుసునని కెటి ఆర్ చేసిన ట్వీట్‌కు ఎంఎల్‌సి కవిత రీ చేశారు.