ఒకరు ఢిల్లీకి గులామైతే, మరొకరు గుజరాత్‌కు గులాం అని దాడి
రైతుల కోసమే కేంద్రంపై పోరు, అయినప్పటికీ బిజెపి, కాంగ్రెస్ సన్నాసులు టిఆర్‌ఎస్‌పై కువిమర్శలు చేస్తున్నారు, అసలు వాళ్లు మనుషులా… పశువులా? : కరీంనగర్ కాంగ్రెస్ నేత లక్ష్మినరసింహరావు టిఆర్‌ఎస్ చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్, బిజెపి నాయకులపై టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకరు ఢిల్లీకి గులాం అయితే… మరొకరు గుజరాత్‌కు గులాం అని అని ధ్వజమెత్తారు. తాము ఢిల్లీ, గుజరాత్‌కు గులాములం కాదని… మీ ఉడుత ఊపులకు భయపడేది లేదన్నారు. నరేంద్రమోడీకి, సోనియాగాంధీకి ఇక్కడ భయపడే వారు ఎవరు లేరన్నారు. తమకు బాసేలు తెలంగాణ ప్రజలేనని అన్నా రు. వారికే మేము జవాబుదారి తనంగా ఉంటామన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ ఎంపిలు తమ కడుపులోని పేగులు తెగే దాక పోరాటం చేశారని కెటిఆర్ ప్రశంసించారు. రాష్ట్రంలోని రైతులు ఆగంకావొదన్న ఏకైక లక్షంతోనే టిఆర్‌ఎస్ పార్టీ కేంద్రంపై యుద్ద మొదలు పెట్టిందన్నారు. అయినప్పటికీ బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు సన్నాసులు టిఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం పూర్తిగా దిగజారుతున్నారని మండిపడ్డారు. అసలు వాళ్లు మనషులా? పశువులా? అని ప్రశ్నించారు. ఒక బిజెపి ఎంపి టిఆర్‌ఎస్ నేతలను పట్టుకుని బియ్యం స్మగ్లర్లు అని సంభోదించడంపై తీవ్ర స్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ చెందిన బలమైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మీ నరసింహరావు తన అనుచరులు, అభిమానులతో కలిసి బుధవారం తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతో రెండున్నర దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న లక్ష్మీనరసింహ రావుకు టిఆర్‌ఎస్‌లోకి రావడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానని అన్నారు. 15 సంవత్సరాలుగా ఆయన తనకు వ్యక్తిగతంగా తెలుసున్నారు. ముక్కుసూటి వ్యక్తిత్వమన్నారు. 2006లో జరిగిన కరీంనగర్ లోక్‌సభకు జరిగిన ఉపఎన్నికల్లో కెటిఆర్ గెలవ బోతున్నారని కాంగ్రెస్‌లో ఉండి కూడా తనతో చెప్పారన్నారు. ఆయన చేరికతో కరీంనగర్‌లో టిఆర్‌ఎస్‌కు కొత్త శక్తి వస్తుందన్నారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, మంత్రి గంగుల కమాలకర్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధితోనే సమాధానమిస్తున్నాం
తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదని విమర్శించిన వాళ్ళు కూడా ముక్కున వేలు వేసుకునేలా రాష్ట్రంలో పాలన జరుగుతోందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. అలాంటి వారికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే తగు సమాధానమిస్తున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన కేవలం ఏడు సంవత్సరాల్లోనే సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. అనేక రంగాల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సాక్షాత్తూ కేంద్రమే రాష్ట్రంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తోందన్నారు. మన రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి ఇంతకన్న నిదర్శనం మరోటి ఉండదన్నారు.
అధ్భుతమైన ప్రగతితోనే దేశంలోనే 2.5 శాతంగా రాష్ట్ర జనాభా ఉంటే… 5 శాతం జిడిపి దేశానికి సమకూరుస్తోందన్నారు. ఇది ఆర్‌బిఐ వెల్లడించిన గణాంకాలు అని కెటిఆర్ పేర్కొరు. అలాగే దేశ తలసరి ఆదాయం కన్నా రాష్ట్ర తలసరి ఆదాయం లక్ష రూపాయలు ఎక్కువన్నారు. ఇది కెసిఆర్ పాలన గొప్పతనం కాదా? అని ప్రశ్నించారు. దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణదే అగ్రస్థానమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం ఆమోగమైన ప్రగతి సాధించిందన్నారు. గుజరాత్‌లో ఇంటింటికి మంచి నీళ్ళు ఇవ్వకున్నా….రాష్ట్రంలో ఇచ్చిన సత్తా ఉన్న నాయకుడు సిఎం కెసిఆర్ అని అన్నారు.
పిసిసి అధ్యక్షుడు… ఒక పిచ్చోడు
పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక పిచ్చోడని కెటిఆర్ అభివర్ణించారు. అందుకే ఆయన చాలా చీప్‌గా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సచివాలయంలో నెల మాళిగలు ఉన్నాయని పిచ్చోడిలా మాట్లాడుతున్న వ్యక్త్తి పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడన్నారు. ఇది ఆ పార్టీ దయనీయమైన పరిస్థితి అద్దం పడుతోందన్నారు. రూ. 50 కోట్ల రూపాయలు లంచమిచ్చి పిసిసి పదవి తెచుకున్నాడని ఆ పార్టీకి చెందిన నాయకుడు కోమటి రెడ్డే ఆరోపించాడు. ఒకడు బియ్యంలో రూ.3 వేల కోట్ల స్కాం అంటాడు. మరొకడు వ్యాక్సిన్లలో రూ.10 వేల కోట్ల స్కాం అంటాడన్నారు. ఏదీ పడితే అది మాట్లాడే వాడికి నెత్తి లేదు.. కత్తి లేదన్నారు.
రైతుల కోసం… దేనికైనా సిద్దమే
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తొండి సంజయ్ లా మారాడని కెటిఆర్ ఆరోపించారు. కేంద్రం తప్పిదాల వల్లే ధాన్యం కొనుగోలు సమస్య తలెత్తిందన్నారు. అయినప్పటికీ బండి సంజయ్ ఈ తప్పును రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దేందుకు యత్నించడం సిగ్గుచేటన్నారు. పైగా రైతుల ను పక్కదారి పట్టించే విధంగా, వారిని ఆగం చేసే విధం గా తప్పుడు ప్రకటనలు చేయడం శోచయనీయమన్నా రు. ఆయన వ్యవహార శైలిని చూసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంజయ్‌కు క్లాస్ పీకానని తమకు స్వయంగా చెప్పాడన్నారు. వాస్తవానికి ఉప్పుడు బియ్యం కొనమని కేంద్రం చెప్పడంవల్లే రాష్ట్రంలో దాన్యంకొనుగోళ్లపై సమస్యలు వచ్చాయన్నారు. ఎపి, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో కూడా ఉప్పుడు బియ్యం సమస్య ఉందన్న విషయాన్ని బండి సంజయ్ గ్రహించాలని కెటిఆర్ సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై టిఆర్‌ఎస్ ఎంపిల ఆందోళనకు కాంగ్రెస్, బిజెపి ఎంపిలు మద్దతు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వరు
కేంద్రానిది దున్నపోతు మీద వాన పడ్డ చందంగా స్పం దన లేని వైఖరని అవలంభిస్తోందని మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేందం, తెలంగాణ ప్రాజెక్టులకు ఇవ్వదని? నిలదీశారు. తెలంగాణకు బిజెపి ఏం చేసిందని ఉద్యమకారులు ఆ పార్టీలో చేరతారని ప్రశ్నించారు. హిం దూ ముస్లీం బాబర్ అక్బర్ తప్ప బిజెపికి ఏం తెలుసని ఎద్దే వా చేశారు. బిజెపి ఉడత ఊపులకు భయపడే వారు ఇక్కడ ఎవ్వరూ లేరన్నారు. అలాగే అరెస్టులు చేస్తామని బెదిరిస్తే కూడా భయపడే వారు ఎవ్వరూ లేరన్నారు. ఏదైనా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం వల్లే రాష్ట్రంలో పంట విస్తీర్ణం బాగా పెరిగిందని కెటిఆర్ స్పష్టం చేశారు.