హైదరాబాద్ : స్కాంగ్రెస్ అసలు రంగు ఇదేనంటూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతిపై మంత్రి కెటిఆర్ ధ్వజమెత్తారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌తో గొడవల మధ్య బకాయిలను క్లియర్ చేయడానికి బిబిఎంపి కాంట్రాక్టర్లు యడ్యూరప్ప సహాయం కోరుతున్నారని కాంగ్రెస్‌పై కెటిఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు డిప్యూటీ సిఎం డికె శివకుమార్ 1015 శాతం లంచం డిమాండ్ చేశారని బిబిఎంపి కాంట్రాక్టర్లు ఆరోపించారు. డికె శివకుమార్‌పై అవినీతి ఆరోపణలు చేసిన ఒక రోజు తర్వాత బిబిఎంపి కాంట్రాక్టర్ల సంఘ సభ్యులు తమ పెండింగ్ బిల్లులను విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పను బెంగళూరులో ఆయన నివాసంలో కలిశారు. బిబిఎంపి కాంట్రాక్టర్ల ప్రతినిధి బృందం యడ్యూరప్పను కలిసి, పెండింగ్ బిల్లుల గురించి వారి మనో వేదనలను వివరించారు.
‘మేం సిఎం, డిప్యూటీ సిఎంలను కలిశాం కానీ మా డిమాండ్‌లు ఇంకా నెరవేరలేదు. మద్దతు కోరుతూ నేతలందరినీ కలుస్తున్నాం. బిబిఎంపి కమిషనర్ ఎటువంటి కారణం లేకుండా మా బిల్లులను క్లియర్ చేయడంలో జాప్యం చేస్తున్నారు. మేం ఎవరినీ టార్గెట్ చేయడం లేదు. కాంట్రాక్టర్లు తప్ప మా వెనుక ఎవరూ లేర’ని కాంట్రాక్టర్ల సంఘ అధ్యక్షుడు మంజునాథ్ అన్నారు. బిజెపిపై 40 శాతం ఆరోపణలే అధికారంలోకి రావడం కారణమని, కాంట్రాక్టర్లను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన స్వల్ప వ్యవధిలోనే ఆ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి డికె శివకుమార్‌పై అవినీతి ఆరోపణలు పెల్లుబుకడం ‘స్కాంగ్రెస్ ట్రూ కలర్స్’కు నిదర్శనం కాక మరేమిటంటూ తెలంగాణ మంత్రి కెటిఆర్ బుధవారం రిట్వీట్ ద్వారా మరోమారు బహిర్గతం చేశారు.